
సాక్షి, కరీంనగర్: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ బుధవారం కలెక్టరేట్‌లో ఖరీఫ్ ధాన్యం సేకరణపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాల అధికారులతో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో అందరి దృష్టిని ఆకర్షించారు. సమీక్షలో రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు నాలుగు జిల్లాల జేసీలు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో కమిషనర్ అకున్ సబర్వాల్ ఖరీఫ్ ధాన్యం సేకరణ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను వెల్లడించారు. ఆనంతరం ఒక్కొక్క జిల్లా అధికారితో పేరుపేరునా పిలుస్తూ ఆయా జిల్లాలకు కావాల్సిన గన్నీ సంచులు, వసతులు, హమాలీల కొరత తదితర విషయాలపై సవివరంగా అడిగి తెలుసుకున్నారు. జాయింట్ కలెక్టర్లను పేరు పెట్టి పిలువడమే కాకుండా మార్కెటింగ్ డీడీలు, డీఆర్‌డీవోలు, పోలీసు అధికారులను సైతం ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తూ సమీక్షిస్తున్న తీరు అబ్బురపరిచింది.
తొమ్మిది గంటలకు టప్పా చూశా..
జగిత్యాల జిల్లాకు సంబంధించి కమిషనరేట్ కార్యాలయానికి ఎలాంటి నివేదిక అందలేదని జగిత్యాల జేసీని ప్రశ్నించగా మంగళవారం పంపించినట్లు వెల్లడించడంతో రాత్రి 9 గంటలకు టప్పా చూశానని ఎలాంటి నివేదికలు అందలేదని రేపటిలోగా సమాచారం పంపించాలని సూచించారు. జగిత్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని అమీనాబేగంను జిల్లాలో సాగవుతున్న పంటలు, విస్తీర్ణం తదితర వివరాలపై ప్రశ్నించడంతో పొంతనలేని సమాధానం చెప్పడంతో పూర్తిస్థాయి సమాచారంతో, పంటల సాగు వివరాలతో గురువారం హైదరాబాద్‌కు రావాలని సూచించారు.
మంత్రి గంగులకు వినతిపత్రం
కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బచ్చు భాస్కర్, అన్నమనేని సుధాకర్‌రావు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం సమీక్ష సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం రాబడి అధికంగా ఉన్న దృష్ట్యా వ్యాపారం నిర్వహించేందుకు రైస్‌మిల్లర్స్‌కు వెసులుబాటు కల్పించాలని కోరారు. కోనుగోలు కేంద్రాల్లో కొత్త గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలని, సరుకు నిల్వ చేసేందుకు రైస్‌మిల్లర్స్‌కు రుణసదుపాయాలు కల్పించాలని, మార్కెట్ రేట్ ప్రకారం బియ్యం ట్రాన్స్‌పోర్టు చార్జీలు చెల్లించేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో రైస్‌మిల్లర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment