ఓటర్లను భయపెడుతున్నారు
- పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు లేకుండా చేస్తున్నారు
- టీఆర్‌ఎస్ కుట్రలపై ఎన్నికల కమిషన్ అప్రమత్తంగా ఉండాలి
- తక్షణమే అసెంబ్లీని సమావేశపర్చాలి
- గవర్నర్‌కు తెలంగాణ సీఎల్‌పీ నేత జానారెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ నేతలు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి మెదక్ ఉప ఎన్నికల్లో ఓటర్లను, కాంగ్రెస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ శాసనసభాపక్షనేత కె.జానారెడ్డి ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు కూడా కూర్చోనీయకుండా కుట్ర చేస్తున్నారని అన్నా రు. ఈ విషయంపై ఎన్నికల సంఘం అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గాంధీభవన్‌లో శనివారం మధ్యాహ్నం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత షబ్బీర్‌అలీతో కలసి మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నేతలు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు.
ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు, విపరీతంగా డబ్బును ఖర్చు చేస్తున్నట్లు తమకు సమాచారం అందుతోందన్నారు. అయినప్పటికీ వీటన్నింటినీ అధిగమించేందుకు కాంగ్రెస్ నేతలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
రాష్ట్రంలో అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలు అనేకం ఉన్నందున తక్షణమే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌కు లేఖ రాసినట్లు తెలిపారు.
వర్షాభావ పరిస్థితులు, కరెంటు కోతలతో రైతులు ఆందోళనలో ఉన్నారని, దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో ఇప్పటివరకు వెల్లడించలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.
ఈ 3 నెలల్లో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏముంది? తెలంగాణను సింగపూర్, లండన్ మాదిరిగా చేస్తానని చెబుతున్నాడు. ఆయనప్రకటనలన్నీ ఆచరణ సాధ్యమయ్యేవా? మీడియా విశ్లేషించాలని అభిప్రాయపడ్డారు.