దేశంలో బీజేపీని బలమైన జాతీయ పార్టీగా చేయడమే లక్ష్యంగా ముందుకు..
సంగారెడ్డి క్రైం : దేశంలో బీజేపీని బలమైన జాతీయ పార్టీగా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మురళీధర్‌రావు మాట్లాడుతూ బీజేపీ గత ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా గణనీయమైన ఓట్లు సాధించిందన్నారు.
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడిందన్నారు. తెలంగాణ లో ప్రస్తుతం తమ పార్టీకి నాలుగున్నర లక్షల సభ్యత్వం ఉందని, దీనిని 25 లక్షలకు పెంచడమే ధ్యేయమన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ విధానాలనే అవలంబిస్తోందని విమర్శించారు. తమ పార్టీ సుపరిపాలన, ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉందన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం మార్చి వరకు కొనసాగుతుందని తెలిపారు.
మార్చి 31 తర్వాత దేశంలోనే అతి బలమైన పార్టీగా బీజేపీ అవతరిస్తుందన్నారు. మైనార్టీలు సైతం తమ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, నాయకులు అంజిరెడ్డి, అనంతరావు కులకర్ణి, విష్ణువర్దన్‌రెడ్డి, సత్తమ్మ, విష్ణువర్దన్ తదితరులు పాల్గొన్నారు.
ధరల నియంత్రణలో విజయవంతం
రామచంద్రాపురం : నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించడంలో తమ ప్రభుత్వం విజయవంతమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంజిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం ధరలు నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరకుల ధరలను నియంత్రించడ జరిగిందన్నారు. అందులో భాగంగానే పెట్రోల్, డీజిల్, బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయన్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో సైతం బీజేపీ ఘన విజయం సాధించిందన్నారు. కాశ్మీర్‌లో సైతం బీజేపీ ఘన విజయం సాధించిందంటే ప్రజలు బీజేపీని ఎంతగా ఆదరిస్తున్నారో తెలుస్తోందన్నారు.
ఉపాధి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ ఒక శక్తిగా తయారవుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, జిల్లా అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, నాయకులు భాస్కర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఆదెల్లి రవీందర్, గౌస్, గాలిరిగి, ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.