రూ.7,500 కోట్లతో మల్లన్నసాగర్!
► వ్యయ అంచనాలకు నీటి పారుదల శాఖ కమిటీ ఆమోదం
► ఇసుక రీచ్‌ల పరిధి, ఉక్కు ధరలు తగ్గడంతో రూ.1,700 కోట్ల మేర తగ్గిన భారం
► ఈ నెలలోనే టెండర్లు చేపట్టాలని హరీశ్‌రావు ఆదేశాలు
► 10న ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టనున్న కొమురవెల్లి మల్లన్నసాగర్(తడ్కపల్లి) రిజర్వాయర్ నిర్మాణానికి రూ.7,500 కోట్లు వ్యయం అవుతుందని నీటి పారుదల శాఖ తేల్చింది. గతంలో దీనిని రూ.9,200 కోట్లుగా అంచనా వేసినా.. ఇసుక రీచ్‌ల పరిధిని కుదించడం, స్టీలు ధరలు తగ్గిన నేపథ్యంలో రూ.1,700 కోట్ల మేర భారం తగ్గినట్లు తెలుస్తోంది. ఈ వ్యయ అంచనాలకు నీటి పారుదల శాఖ ఐబీఎం కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో ఈ నెలలోనే టెండర్లు పిలవాలని గురువారం నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై 10వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
తగ్గిన వ్యయం
తొలుత ప్రతిపాదించిన 1.5 టీఎంసీల లెక్కన మల్లన్నసాగర్ అంచనా వ్యయం రూ.1,864కోట్లు కాగా.. దానికి 4.86 శాతం అధికంగా కోట్ చేయడంతో వ్యయం రూ.1,954.59 కోట్లుగా తేలింది. అయితే ఆ తర్వాత రిజర్వాయర్‌ను 50 టీఎంసీలకు పెంచి, కొత్త అంచనా వ్యయాన్ని రూ.9,200 కోట్లుగా లెక్కించారు. మల్లన్నసాగర్ ద్వారా సరఫరా అయ్యే నీటితో ఏకంగా 9 ప్యాకేజీల్లో 10.81 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించడంతో పాటు మరో 7.37 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే అవకాశం ఉంది.
మల్లన్నసాగర్ నుంచే కొండపోచమ్మ, బస్వాపూర్, గంధమల రిజర్వాయర్లకు నీరు వెళుతుంది. అయితే ఈ రిజర్వాయర్‌కు అవసరమయ్యే మట్టి, ఇసుకలను దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చేలా అధికారులు సిద్ధం చేసిన తొలి ప్రణాళికలను మార్చారు. ఇసుక తీసుకునే రీచ్‌ల పరిధిని కుదించడం, నేరుగా నీటి పారుదల శాఖే తీసుకునేలా నిర్ణయించడంతో ఏకంగా రూ.750 కోట్ల మేర భారం తగ్గింది. ఇక ఉక్కు ధర టన్నుకు రూ.1,100 మేర తగ్గడంతో సుమారు మరో రూ.900 కోట్ల భారం తగ్గింది. దీంతో తాజా అంచనా రూ.7,500 కోట్లకు చేరింది. ప్రస్తుత అంచనాలు కొలిక్కి రావడంతో ఈ నెలలోనే టెండర్లు పిలవాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు ఆదేశించారు.
సామర్థ్యం పెంపుతో..
ప్రాజెక్టులో ప్రతిపాదించిన 160 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు.. సిద్దిపేట జిల్లా పరిధిలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు, గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌ను 1 టీఎంసీ నుంచి 21 టీఎంసీలకు ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. వీటితోపాటు ఇమాంబాద్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1 టీఎంసీ నుంచి 3 టీఎంసీలకు పెంచింది. కొత్తగా నల్లగొండ జిల్లాలో గంధమలను 9.86 టీఎంసీలతో, బస్వాపూర్‌ను 11.39 టీఎంసీలతో రిజర్వాయర్లు చేపట్టాలని నిర్ణయించింది.