సాక్షి, హైదరాబాద్ : చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా వైరస్ కేసులను వైద్యులు గుర్తించారు. కేరళకు చెందిన ఓ విద్యార్థికి కరోనా వైరస్ సోకిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. అలాగే వైరస్ సోకిందనే అనుమానంతో ఇప్పటికే పలువురు వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. తాజాగా మియాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా వైరస్ లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే అతను చైనా నుంచి నగరానికి వచ్చారు. అయితే ప్రస్తుతం గాంధీలో అతనికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కరోనా నిర్ధారణ పరీక్షలు కోసం ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అనుమానితుల రక్త నమూనాలను కొరియర్ ద్వారా విమానాల్లో పుణేకు పంపి పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఆ ఫలితాలు రావడానికి 24 గంటల సమయం పట్టేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా గాంధీ ఆసుపత్రిలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని వైద్య యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకు కేంద్రం కూడా ఆమోదం తెలిపింది. గాంధీ ఆసుపత్రిలోని వైరాలజీ ల్యాబ్‌లో కరోనా పరీక్షలు చేసేందుకు అనువుగా ఉందని వైద్య అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ప్రాణాంతక కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రకాల చర్యలు చేపడుతోంది. అలాగే చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లలో ప్రత్యేకంగా థర్మల్ స్కానింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
చదవండి : కరోనా పరీక్షలు ఇక ‘గాంధీ’లోనే
Comments
Please login to add a commentAdd a comment