బంజారాహిల్స్ : ప్రేమించినట్లు నటించి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేయడంతో ఆమె సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కస్తూరిపాడు గ్రామానికి చెందిన సనపాల విద్యాసాగర్(35) పంజగుట్టలో ఓ కన్సల్టేషన్ కార్యాలయం నిర్వహిస్తూ ఇన్ఫోటెక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న డి.ఉషారాణి(26)ని ప్రేమించాడు. పెళ్ళి చేసుకుంటానని నమ్మించాడు.
తీరా మరో యువతిని పెళ్ళి చేసుకోవడంతో ఉషారాణి తీవ్ర మనస్థాపానికి గురై గత నెల 17వ తేదీన బంజారాహిల్స్ రోడ్ నెం. 2 లోని ఇందిరానగర్‌లో ఉన్న తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు తాను ప్రేమించిన విద్యాసాగర్ చీటింగ్ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు, తన సంపాదనంతా వాడుకొని మోసగించినట్లు సూసైడ్ నోట్ రాసింది. దీని ఆధారంగా నిందితుడిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసి పరారీలో ఉన్న విద్యాసాగర్‌ను ఫోన్ సిగ్నల్ ఆధారంగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ ఎస్‌ఐ సంతోషం కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ పేరుతో మోసగించిన వ్యక్తికి రిమాండ్
Published Thu, Mar 3 2016 6:56 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement
Advertisement