
జిన్నారం (పటాన్‌చెరు): కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడానికి కారణమైన వారిపై పెట్రోల్ పోసి హత్య చేసేందుకు యత్నించాడు ఓ తండ్రి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని రాంరెడ్డిబావి గ్రామంలో ఆదివారం జరిగింది. గుమ్మడిదల ఎస్‌ఐ రాజేశ్‌నాయక్ కథనం ప్రకారం.. రాంరెడ్డిబావి గ్రామానికి చెందిన మోహన్‌రెడ్డి, సుశీల దంపతులకు నవీన్‌రెడ్డి, మమత ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ నెల 17న అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి కుమార్తె ప్రవళిక, నవీన్‌రెడ్డిలు హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకుని అమీన్‌పూర్‌లో కాపురం పెట్టారు.
ఇదిలా ఉండగా నవీన్‌రెడ్డి తల్లి సుశీల వీరికి వివాహం చేసేందుకు సహకరించిందని శ్రీనివాస్‌రెడ్డి పగను పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సుశీల ఆమె కుమార్తె మమతలు ఇంట్లో ఉండగా శ్రీనివాస్‌రెడ్డి దంపతులు సుశీల ఇంటికి వచ్చి వారితో గొడవ పడ్డారు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన శ్రీనివాస్‌రెడ్డి వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను వారిపై పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో సుశీల కుమార్తె మమతకు 35 శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం మమత ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మమత తల్లి సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment