
మిస్డ్‌కాల్ పరిచయం.. ఆపై మోసం
హైదరాబాద్: మహిళకు మాయమాటలు చెప్పి మోసం చేసిన యువకుడిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ఉమ(28) వనస్థలిపురంలో ఉంటోంది. పంజగుట్టలో కంప్యూటర్ కోర్సు చేస్తున్న ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన యశ్వంత్ చౌదరి (25)తో ఈమెకు మిస్డ్ కాల్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఉమకు గతంలోనే వివాహమై ముగ్గురు పిల్లలున్నారు.
కాగా, ఇద్దరూ తరుచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఇదిలా ఉండగా, పది రోజుల క్రితం ఆమె తన పిల్లల్ని పుట్టింట్లో వదిలి యశ్వంత్ వద్దకు వచ్చేసింది. వారం పాటు గడిపిన యశ్వంత్ మూడు రోజుల క్రితం ఆమెను అమీర్‌పేటలోని ఓ హాస్టల్‌లో వదలి వెళ్లిపోయాడు. ఫోన్ చేస్తే స్పందన లేకపోవడంతో మోసపోయానని గుర్తించిన ఉమ సోమవారం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు యశ్వంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా.. పది రోజులుగా తన కొడుకు ఆ చూకీ లభించలేదని యశ్వంత్ తండ్రి పాపారావు మూడు రోజుల క్రితం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేశారు.