
ఇళ్ల పట్టాల పేరుతో మోసం
కుత్బుల్లాపూర్ (రంగారెడ్డి) : ఇళ్ల పట్టాలు, డబుల్ బెడ్‌రూం ఫ్లాట్లు, ఫించన్లు ఇప్పిస్తామని చెప్పి ఒక వ్యక్తి స్థానికుల నుంచి రూ.200 నుంచి రూ. 500 వరకు వసూలు చేస్తున్నాడు. ఈ సంఘటన మంగళవారం నగరంలోని కుత్బుల్లాపూర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కాలనీలోని పలువురికి ఇళ్ల పట్టాలు, డబుల్ బెడ్ రూం ఫాట్లు, ఫించన్లు, ఇప్పిస్తామని ఒక వ్యక్తి డబ్బులు వసూలు చేస్తున్నాడు. అంతేకాకుండా ఆధార్ కార్డులు, రెండు ఫోటోలు కావాలని డిమాండ్ చేశాడు. వెంటనే కాలనీ వాసులంతా జిరాక్స్ దుకాణం వద్ద గుమిగూడారు. విషయం తెలిసిన సాక్షి ప్రతినిధి అక్కడకు చేరుకొని విషయం ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. తెలంగాణ భారత కమ్యూనిస్ట్ పార్టీ శాఖ సోషల్‌సర్వీస్ కార్యకర్తగా చేప్పుకుంటున్న ఒక వ్యక్తి ఈ పనికి పూనుకున్నాడు. ప్రజల వద్ద నుంచి ఆధార్ కార్డులను స్వీకరిస్తున్నాడు.
ఇతను ఈ నెల 8వ తేదీన కుత్బుల్లాపూర్‌లోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఇదే పని చేస్తుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. కాగా నిందితుడు తాజాగా అదే కాలనీలో మళ్లీ ఈ పనికి పూనుకోవడం విశేషం. ఇదే విషయాన్ని అతన్ని అడగ్గా.. తనను పోలీసులు పట్టుకోలేరని, ఒక వేళ పట్టుకున్నా వెంటనే బయటకు వస్తానని చెప్పడం కొసమెరుపు. అయితే ఆధార్‌కార్డులు ఇచ్చిన స్థానికులు మాత్రం భయాందోళనలకు గురవుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో మోసగాడు అక్కడి నుంచి జారుకున్నాడు.