మెదక్ : మెదక్ జిల్లా పుల్‌కల్ మండలం బద్రిగూడెంలో శుక్రవారం రాత్రి ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధమే ఇందుకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మున్నూర్ అశోక్ (40)ను రాత్రి సమయంలో కొందరు వచ్చి, పని ఉందంటూ సమీపంలోని బైరి ఆశయ్య ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ అతన్ని కొట్టి, గొంతుకు వైర్‌ను బిగించడంతో మృతి చెందాడు. కాగా దీనిపై సమాచారం అందుకున్న పుల్‌కల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.
ఈ ఘటనలో ఐదుగురు వరకు పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వివాహేతర సంబంధం వల్లే అతన్ని హతమార్చి ఉంటారని సమాచారం. కాగా, అశోక్‌కు భార్య, ముగ్గురు కూతుళ్లు లావణ్య(11), జ్యోతి(8), శ్రీలత (4)తో పాటు 20 రోజుల బాబు ఉన్నాడు. వీరంతా అశోక్‌పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. మృతుని భార్య మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనుమానితులను కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.