
సీటుకో రేటు!
అడ్డగోలుగా ఇంజనీరింగ్ సీట్ల అమ్మకాలు
మేనేజ్‌మెంట్ కోటా సీటు
→ టాప్ కాలేజీల్లో రూ. 12 లక్షలు,
→ ద్వితీయ శ్రేణి కాలేజీల్లో రూ. 38 లక్షలు
► ప్రవేశాల నోటిఫికేషన్ రాకముందే బేరసారాలు
► కాలేజీలకు ఇంకా అనుబంధ గుర్తింపే రాలేదు
► ఈలోగానే సీట్లను అంగట్లో పెట్టి అమ్ముతున్న యాజమాన్యాలు
► ఆందోళనలో తల్లిదండ్రులు.. పట్టించుకోని ఉన్నత విద్యా మండలి
శ్రీనివాస్‌రావు ఓ ప్రైవేటు ఉద్యోగి. ఆయన కొడుకు శ్రీవాత్సవకు ఎంసెట్‌లో 75 వేలకు పైగా ర్యాంకు వచ్చింది. కష్టమైనా కొడుకును ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చదివించాలన్నది ఆయన కోరిక. హిమాయత్‌నగర్‌లో ఓ టాప్ కాలేజీ బ్రాంచి ఆఫీస్‌ను సంప్రదించారు. అక్కడున్న వారు ‘సీట్లు అయిపోవచ్చాయి. రెండే ఉన్నాయి. కావాలంటే రూ.12 లక్షలు అవుతుంది.. ముందుగా రూ.1 లక్ష చెల్లించి రిజిస్టర్ చేయించుకోండి.. లేదంటే అవీ ఉండవు..’ అనడంతో కంగుతిన్నారు.
నర్సింహమూర్తి ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన కూతురు లక్ష్మీప్రసన్న ఎంసెట్, జేఈఈ రాసింది. ఎంసెట్‌లో 28 వేలకు పైగా ర్యాంకు వచ్చింది. మంచి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతానంటోంది. దీంతో ఆమె తండ్రి ఓ కన్సల్టెన్సీని సంప్రదించారు. సీటుకు రూ.15 లక్షలు అని వారు చెప్పడంతో నోట మాట రాలేదు.
సాక్షి, హైదరాబాద్
...ఇది ఈ ఇద్దరు తల్లిదండ్రులదే కాదు.. టాప్ కాలేజీలు, ద్వితీయశ్రేణి ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీటు కోసం యత్నిస్తున్న తల్లిదండ్రులందరిదీ ఇదే పరిస్థితి. సీటు కావాలంటే రూ.5 లక్షల నుంచి రూ.12 లక్షలు చెల్లించాల్సిందేనంటున్నాయి కాలేజీలు! దళారులు సైతం రంగంలోకి దిగి టాప్ కాలేజీల్లో సీట్లు కావాలంటే బ్రాంచిని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అవుతుందంటూ బేరాలు నడుపుతున్నారు. అదీ ముందు కనీసం రూ.1 లక్ష చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ సీటు ఉంటుందని చెబుతుండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ పిల్లలను టాప్ కాలేజీల్లో చదివించుకోవాలన్న తల్లిదండ్రుల ఆకాంక్షను యాజమాన్యాలు ఇలా క్యాష్ చేసుకుంటూ సీట్లను అడ్డంగా అమ్ముకుంటున్నా ఉన్నత విద్యా మండలి స్పందించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అనుబంధ గుర్తింపు రాకముందే..
ఇంకా ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపే రాలేదు. ఎన్ని సీట్లకు అనుమతి వస్తుందో తెలియదు. ఇప్పటివరకైతే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతి ఇచ్చిన 242 కాలేజీల్లో 1,24,239 లక్షల సీట్లలో కేవలం 65 వేల సీట్లకే యూనివర్సిటీల నుంచి అనుబంధ గుర్తింపునకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. అదికూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇంకా ఎన్ని సీట్లకు అనుబంధ గుర్తింపు వస్తుందో తెలియదు. అయినా యాజమాన్యాలు మేనేజ్‌మెంట్ కోటా సీట్లను అడ్డగోలుగా అమ్మకానికి పెట్టాయి. ప్రతిభ, ర్యాంకులతో సంబంధం లేదు. డబ్బులు చెల్లిస్తే చాలు.. మా సీట్లు... మా ఇష్టం.. అమ్మేసుకుంటాం అన్న రీతిలో ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి.
70 శాతం కన్వీనర్ కోటా సీట్లకు ప్రవేశాల నోటిఫికేషన్ జారీ కాకముందే 30 శాతం మేనేజ్‌మెంట్ కోటా సీట్ల అమ్మకానికి తెర లేపాయి. ‘సీట్లు అయిపోతున్నాయి... త్వరగా అడ్వాన్స్ చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోండి..’అంటూ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ విషయం ఉన్నత విద్యా మండలికి తెలిసినా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదులు వస్తేనే చర్యలు చేపడతామంటూ చేతులు ముడుచుకు కూర్చుంది. కనీసం ర్యాటిఫికేషన్లు ఇచ్చే సమయంలో కాలేజీ వారీగా ప్రతిభావంతులకే సీట్లు ఇచ్చారా? లేదా? అన్న విషయాలను కూడా ఉన్నత విద్యా మండలి అధికారులు సరిగ్గా చూడకుండా, యాజమాన్యాల అమ్మకాలకు ఆమోద ముద్ర వేస్తుండటం వల్లే అడ్డగోలుగా సీట్ల అమ్మకాలు సాగుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
ఇంజనీరింగ్‌లో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో, 30 శాతం సీట్లను మేనేజ్‌మెంట్ కోటా (బీ కేటగిరీ) కింద భర్తీ చేయాలి. యాజమాన్య కోటాలో 15 శాతం సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా, మిగిలినవాటిని ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ కోటాలో విద్యార్థులకు కేటాయించాలి. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో జేఈఈ మెయిన్ ర్యాంకుల వారీగా సీట్లు కేటాయించగా మిగిలితే ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా మెరిట్ ప్రకారం సీట్లను ఇవ్వాలి. కానీ దరఖాస్తుల ప్రక్రియ లేకుండానే సీట్లను అమ్మకానికి పెట్టాయి. వాస్తవానికి కన్వీనర్ కోటా సీట్లకు నిర్ణయించిన ఫీజునే మేనేజ్‌మెంట్ కోటా(ఎన్నారై మినహా) సీట్లకు వర్తింపజేయాలి. కానీ అదేమీ లేకుండా యాజమాన్యాలు లక్షలకు అమ్ముకుంటున్నాయి. చివరకు ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు కూడా అదనంగా డిమాండ్ చేస్తున్నాయి.
కన్సల్టెన్సీల మాయాజాలం..
కన్వీనర్ కోటాలో సీటు రాదేమోనన్న తల్లిదండ్రుల ఆందోళనను యాజమాన్యాలు, కన్సల్టెన్సీలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఈ విషయంలో ఇటు ఉన్నత విద్యా మండలి, అటు ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో యాజమాన్యాలు ఆడిందే ఆటగా సాగుతోంది. ద్వితీయ శ్రేణి కాలేజీలు కూడా ఈసీఈ, సీఎస్‌ఈ వంటి సీట్లకు రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని కాలేజీ యాజమాన్యాలైతే కన్సల్టెన్సీలతో ఒప్పందం కుదుర్చుకుని, కమీషన్ ప్రాతిపదికన సీట్లు అమ్ముకుంటున్నాయి. కొన్ని కాలేజీల సిబ్బంది అయితే తల్లిదండ్రులకు ఫోన్లు చేసి మరీ.. సీట్లు అయిపోతున్నాయంటూ ఆందోళనలో పడేస్తున్నాయి.
కొన్నింట్లోనే ఆన్‌లైన్..
మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి ముందుగా నోటిఫికేషన్ జారీ చేసి, విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. అలా వచ్చిన విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించాలి. అలా సీట్లు పొందిన విద్యార్థుల వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలి. కానీ దీన్ని కొన్ని కాలేజీలే పాటిస్తున్నాయి. మిగితా కాలేజీల్లో ఆన్‌లైన్ లేకుండా పోయింది. ఈ విషయంలో ఉన్నత విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఉన్నత విద్యామండలి కూడా గుడ్డిగా ఆమోదముద్ర (ర్యాటిఫికేషన్) వేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.