హీరా గ్రూప్‌కు ఈడీ వేడి! | Managing director of Heera group jailed for fraud | Sakshi
Sakshi News home page

హీరా గ్రూప్‌కు ఈడీ వేడి!

Published Fri, Feb 22 2019 1:34 AM | Last Updated on Fri, Feb 22 2019 1:34 AM

Managing director of Heera group jailed for fraud - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒక కంపెనీ లేదు.. మ్యాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ లేదు.. కనీసం క్రయవిక్రయ దుకాణాలు సైతం లేవు.. అయినప్పటికీ కేవలం స్కీముల పేరుతో రూ.వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిన హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా నౌహీరా షేక్‌ చుట్టూ ఉచ్చు బిగించడానికి రంగం సిద్ధం చేస్తోంది.  హీరా సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో కొందరు డమ్మీలు ఉన్నారని, మనీల్యాండరింగ్‌లో భాగంగానే ఈ పెట్టుబడులు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. నౌహీరాతో పాటు ఆమె సంస్థలపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్న ఈడీ గురువారం సీసీఎస్‌ అధికారులతో భేటీ అయింది.  

రిటర్నుల్లో తేడాలు..
హీరా గ్రూప్‌ సంస్థ ఆరేళ్లల్లో రూ.6 వేల కోట్లు టర్నోవర్‌ చేసినట్లు గతంలో రిటర్నులు దాఖలు చేసింది. 2010–11లో కేవలం రూ.27 లక్షలుగా ఉన్న గ్రూ ప్‌ టర్నోవర్‌.. 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటేసింది. అయి తే దీనికి సంబంధించి పూర్తి రికార్డులు ఎక్కడా అందుబాటులో లేవు. ఆదాయపు పన్ను (ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐవో), రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్వోసీ) వీటిలో ఒక్కో విభాగానికి ఒక్కో రిటర్ను ఫైల్‌ చేసింది. కనీసం డిపాజిట్‌దారుల జాబితా సైతం బయటపెట్టకపోవడంతో అనేక ప్రయత్నాలు చేసిన సీసీఎస్‌ పోలీసులు హీరా గ్రూప్‌ సర్వర్‌ను బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో గతేడాది గుర్తిం చారు. దీంతో పాటు స్వాధీనం చేసుకున్న కొన్ని హార్డ్‌డిస్క్‌ల్ని విశ్లేషించి అనేక కీలక విషయాలు గుర్తించారు.

విదేశీ ఇన్వెస్టరు.. ‘ఫెమా’ఉల్లంఘన! 
ప్రాథమికంగా 1.7 లక్షలు మంది ఇన్వెస్టర్ల జాబితాను సంగ్రహించగలిగారు. వీరిలో కొందరు విదేశీయులుగా ఆ రికార్డులు చెప్తున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం విదేశీ పెట్టుబడుల్ని అవసరమైన అనుమతులు తీసుకున్న తర్వాత కేవలం భారత కరెన్సీలోనే స్వీకరించాలి. అయితే ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం హీరా గ్రూప్‌ రూ.5,647 కోట్లు భారత కరెన్సీలో భారతీయుల నుంచి డిపాజిట్లు సేకరించింది. దీనికి తోడు 6 లక్షల అమెరికా డాలర్లు, 132 కోట్ల యూఏఈ దిరమ్స్, 45 కోట్ల సౌదీ రియాల్స్, 10 కోట్ల కువైడ్‌ దీనార్స్‌ పెట్టుబడులుగా వచ్చాయి. ఇలా విదేశీ కరెన్సీలో పెట్టుడబులు సేకరించడం ఫెమా చట్టానికి వ్యతిరేకం. మరోపక్క ఇప్పటి వరకు హీరా గ్రూప్‌ భారత్‌ కరెన్సీలో రూ.2,500 కో ట్లు, 2 లక్షల అమెరికా డాలర్లు, 120 కోట్ల యూఏఈ దిరమ్స్, 1.36 లక్షలు సౌదీ రియా ల్స్‌ డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించినట్లు తేలింది. వీటితోపాటు విదేశీ బ్యాంకుల్లో ఈ సంస్థకు చెందినవిగా అనుమానిస్తున్న 8 బ్యాం కు ఖాతాలను సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు.  

దర్యాప్తు సంస్థలకు సీసీఎస్‌ లేఖలు.. 
సీసీఎస్‌ పోలీసులు తాము సేకరించిన వివరాలన్నీ క్రోడీకరిస్తూ తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈడీ, ఆదాయపుపన్ను శాఖ, సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌లకు లేఖలు రాశారు. దీంతో స్పందించిన ఈడీ ప్రాథమిక విచారణ నేపథ్యంలో ఈ స్కామ్‌ వెనుక మనీల్యాండరింగ్‌ సైతం ఉన్నట్లు గుర్తించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం గురువారం సీసీఎస్‌ డీసీపీ అవినాష్‌ మహంతితో ఈడీ హైదరాబాద్‌ యూనిట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ గోయల్‌ భేటీ అయ్యారు. సీసీఎస్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అదనపు డీసీపీ జోగయ్య, కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న ఏసీపీ రామ్‌కుమార్‌ సైతం పాల్గొన్నారు. తమ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన, సేకరించిన వివరాలను సీసీఎస్‌ పోలీసులు ఈడీ దృష్టికి తీసుకువెళ్లారు. కొన్ని కీలక డాక్యుమెంట్లను అప్పగించారు. ఇప్పటి వరకు లభించిన ఆధారాలను బట్టి హీరా గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన వారి సంఖ్య దాదాపు 2 లక్షల వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 

రూ.60 కోట్లతో  ఫైవ్‌స్టార్‌ హోటల్‌..
పోలీసులు ఖాతాలు ఫ్రీజ్‌ చేసే నాటికి ఈ సంస్థకు ఉన్న వివిధ బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.25 కోట్లు మాత్రమే నగదు నిల్వ ఉంది. కేవలం 12,000 మంది ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తమే రూ.300 కోట్లుగా బయటపడింది. దీనికి తోడు ఇప్పటివరకు మరో 10 వేల మంది తమకు రూ.350 కోట్లు రావాల్సి ఉందంటూ పోలీసులకు నివేదించారు. ఈ మిస్టరీని ఛేదించడంపై ఈడీ అధికారులు దృష్టిపెట్టారు. కేరళలోని కొచ్చిన్‌లో ఉన్న ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ను నౌహీరా షేక్‌ రూ.60 కోట్లు వెచ్చించి ఖరీదు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఆ హోటల్‌లో ఎలాంటి బుకింగ్స్‌ జరగట్లేదు. దీంతో దాని కార్యకలాపాలు ఆరా తీయాలని అధికారులు భావిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement