తీగలాగితే కదులుతున్న డొంక!
హైదరాబాద్: హవాలా మార్గంలో విదేశాలకు భారీగా నగదు తరలిస్తుండగా పట్టుకున్న కేసును టాస్క్ పోర్స్ పోలీసులు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్)కు అప్పగించారు. ఈడి ఈ కేసు విచారణను చేపట్టింది. ఈ విచారణలో కొత్త విషయాలు బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. హవాలా వ్యవహారం గురించి పక్కా సమాచారంతో హైదరాబాద్ టాస్క్ పోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. విదేశాలకు అక్రమంగా డబ్బు తరలిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను శనివారం హిమాయత్ నగర్లో టీటీడీ కళ్యాణమండపం సమీపంలో అరెస్ట్ చేశారు. వారిలో షేక్ మహ్మద్ ఆష్రఫ్ అనే యువకుడుతోపాటు హైదరాబాద్ హిరా గ్రూపుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. హిరా గ్రూపుకు చెందిన నౌహెరా షేక్ అనే మహిళ కూడా ఉంది. వారి నుంచి పోలీసులు రూ. 84.75 లక్షల నగదుతోపాటు 2 కార్లు, ఐదు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని చాంద్‌బాగ్‌కు చెందిన లక్ష్మణ్ అనే హవాలా ఏజంట్కు ఈ డబ్బు ఇవ్వడానికి వారు వెళుతున్నట్లు సమాచారం.
టాస్క్ఫోర్స్ అదనపు డిసిపి ఎన్ కోటిరెడ్డి కథనం ప్రకారం అకౌంటెంట్ షేక్ మహ్మద్ అష్రాఫ్ రూ. 84.75 లక్షల హవాలా నగదును రాజేంద్రకుమార్ అంబాలాల్‌కు ఇచ్చాడు. అంబాలాల్, పి రెడ్డికుమార్, పటేల్ జయేష్‌కుమార్, పటేల్ మహేంద్ర, రాథోడ్ కనక్‌లతో కలిసి డబ్బును తరలిస్తుండగా నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు వారిని పట్టుకున్నారు. ఈ సొమ్మును హవాల ద్వారా వారు దుబాయ్‌కి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. స్వాధీనం చేసుకున్న నగదును పోలీసులు ఆదాయంపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అప్పగించారు.
హీరా సంస్థ హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నిబంధనలకు విరుద్ధంగా ఇస్లామిక్ యూనివర్సిటీ భవన నిర్మాణం వివాదాలకు దారితీసింది. హీరా ఇంటర్నేషనల్ సంస్థ తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలోనూ, శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వెంకన్న ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి పక్కన ఆరు అంతస్థుల భవనాలు నిర్మిస్తోంది. అక్కడ హీరా ఇంటర్నేషనల్ ఇస్లామిక్ అరబిక్ కళాశాల పేరిట బోర్డులు కూడా పెట్టారు. రెండస్థుల భవన నిర్మాణానికి మాత్రమే అనుమతి పొంది, ఆరు అంతస్థుల భవనం నిర్మించారు. ఈ సంస్థ ప్రభుత్వ స్థలం ఆక్రమించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ హీరా గ్రూపే హవాలా మార్గంలో డబ్బును దుబాయ్ పంపిస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు.