మంచాల: పర్యాటక అభివృద్ధిలో భాగంగా మంచాల మండలానికి మహర్దశ పట్టనుంది. కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధికి తలపెట్టిన ప్రణాళికలో మంచాల మండలానికి చోటుదక్కింది. అంతేకాకుండా మెగా సర్క్యూట్‌లో భాగం గా మండల సరిహద్దు ప్రాంతాలైన రాచకొండ కోటతోపాటు గాలిషాహీద్ దర్గా, నారాయణపురం, అల్లపురం గ్రామాల్లోని దేవాలయాలు, ఆరుట్ల దేవాలయంతోపాటు వ్యాలీ ఆఫ్ బంజారా సర్క్యూట్ కింద శివన్నగూడెం రాక్ ఫార్మేషన్స్‌లను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి శ్రీపద్ యశోనాయక్ ఈ నెల 22న లోక్‌సభలో లిఖిత పూర్వకంగా పేర్కొన్నారు.
దీంతో రాచకొండ కోటను చారిత్రాత్మక కట్టడంగా గుర్తించడంతోపాటు దీని సమీపంలోని గాడిపీర్లవాగు సమీపంలోని గాలిషాహీద్ దర్గాను కూడా అభివృద్ధి చేయనున్నారు. అల్లాపూర్ సమీపంలోని సరళ మైసమ్మ దేవాలయం, ఆరుట్లలోని శ్రీ బుగ్గరామ లింగేశ్వరస్వామి దేవాలయం, నారాయణపురం మండలంలోని రాచకొండగుట్టల సరిహద్దులోని పలు దేవాలయాలు కూడా అభివృద్ధి చెందనున్నాయి.
భూముల కొనుగోలుపై నజర్
మంచాల మండలానికి తూర్పు భాగంలో అటు రాచకొండకోట, నల్గొండ జిల్లా నారాయణపురం మండలం, ఇటు శివన్నగూడెం ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ముందుకు వస్తోంది. దీంతో ద్వీపకల్పంగా మారిన మంచాల మండల పరి సర భూములపై పారిశ్రామికవేత్తలు దృష్టి సారించారు. సర్కారు సైతం పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు ఇక్కడి ప్రభుత్వ భూములను గుర్తించారు.
నారాయణపు రం మండలంలోని రాచకొండకోట పరిస ర ప్రాంతంలోని సర్వే నంబర్ 273లో దాదాపు 8 వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. ఇవి అటు నాగారం నుంచి మొదలుకొని అల్లాపురం, నారాయణపురం, జనగామ, పల్లెగుట్ట తండా, కడీలబావి తండా గ్రామాల పరిసర ప్రాంతాలను అనుసరించి ఉన్నాయి. ఇందులో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. మంచాల రెవెన్యూ పరిధిలోని ఆరుట్ల సమీపంలో 587 సర్వే నంబర్ నుంచి 619 సర్వే నంబర్లలో నాలుగు వందల ఎకరాల పట్టా భూములను బెంగళూరు- తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఓ కంపెనీ కొనుగోలు చేసింది.
ఈ భూము లు ముచ్చర్లకుంట గ్రామం నుంచి బండలేమూర్, వాయిలపల్లి, జనగామ, లోయపల్లి శివారు ప్రాంతాలను అనుసరించి ఉన్నాయి. ఇదే కంపెనీ మంచాల మండలాన్ని అనుసరించి ఉన్న నల్గొండ జిల్లా ఖుదాభక్షుపల్లి, లచ్చమ్మగూడెం, చిల్లాపురం పరిసర ప్రాంతాల్లో మరో వెయ్యి ఎకరాలు కొనుగోలు చేశారు. రాచకొండగుట్టలకు మంచి రోజులు రావడంతో మంచాల మండలం, నారాయణపురం, మర్రిగూడ మండలాలు అభివృద్ధికి నోచుకోనున్నాయి. కాగా ఇప్పటికే రియల్టర్లు, వివిధ కంపెనీల యజమానులు గుట్టుచప్పుడు కాకుండా భూముల కొనుగొలుపై దృష్టి సారించినట్లు సమాచారం.
‘మంచాల’కు మంచికాలం!
Published Sat, Jul 26 2014 11:59 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement