మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణంలో ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తోంది. మా ప్రాణాలు పోయినా జలాశయాన్ని కట్టనివ్వం. మమ్మల్ని చంపేసి జలాశయాన్ని నిర్మించుకోండి. అంటూ ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు 21వ ప్యాకేజీ ప్రకారం పనులకు మేము ఒప్పుకున్నాం. ఆ పరిహారం ఇంతవరకూ అందలేదు. పాత డిజైన్ ప్రకారం పనులు చేసుకుంటే అడ్డుకోబోము. రీ డిజైన్ ప్రకారం.. అంటే మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణానికి మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
మోపాల్(నిజామాబాద్ రూరల్): బుధవారం మోపాల్ మండలం మంచిప్ప గ్రామపరిధిలోగల కొండెం చెరువు సమీపంలో రిజర్వాయర్‌పై అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ప్రజాభిప్రాయసేకరణకు మంచిప్పతోపాటు ముంపునకు గురయ్యే రెండు గ్రామాలు, తొమ్మిది తండాల నుంచి ప్రజలు వచ్చారు. ముందుగా ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు, పెరిగే ఆయకట్టు, ముంపునకు గురయ్యే గ్రామాలు, తండాలు, 21వ ప్యాకేజీ పాత డిజైన్, కొత్త డిజైన్ వివరాలు, ప్రాజెక్టు వ్యయం, తదితర వివరాలను కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ ఆత్మారాం వివరించారు. ఇందుకు సంతృప్తి చెందని ముంపు గ్రామాల ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్ట్ 22న జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా ఏకపక్షంగా సాగిందని, అక్కడ మా ముంపు బాధితులు ఎవరూ రిజర్వాయర్ నిర్మాణానికి ఒప్పుకోలేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు 21వ ప్యాకేజీ ప్రకారం పనులకు తాము ఒప్పుకున్నామని, ఆ పరిహారం ఇంతవరకూ అందలేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పాత డిజైన్ ప్రకారమే పనులు చేసుకుంటే అడ్డుకోబోమని, రీ డిజైన్ ప్రకారం అంటే మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణానికి మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రాణాలు పోయినా సరే.. ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు. మల్లన్నసాగర్ ఘటనలు పునరావృతం అయినా వెనకాడేది లేదన్నారు. ఇది పూర్తిగా ప్రజావ్యతిరేకమైన ప్రాజెక్టు అని, అడవిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని పేర్కొన్నారు. రిజర్వాయర్ వల్ల ముంపు పెరిగిందే తప్పా.. ఆయకట్టు పెరగలేదని, అధికారులు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని విమర్శించారు.
వందకు వందశాతం గిరిజనులమైన తమతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, మా జీవితాలను నాశనం చేయవద్దని కోరారు. ముంపు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలకు తాము సహకరిస్తామని, ఆ రకమైన చర్యలకు పూనుకోవాలని సూచించారు. వందల ఏళ్ల నుంచి ఈ అడవితో అవినాభావ సంబంధం ఏర్పడిందని, ఇప్పడికిప్పుడు తరలిస్తామంటే ఎక్కడికి వెళ్లాలని అధికారులను సూటిగా ప్రశ్నించారు. మమ్మల్ని బిచ్చగాళ్లుగా, అడ్డాకూలీలుగా మార్చవద్దని వేడుకున్నారు. గతంలో జీపీలు ఇచ్చిన తీర్మానాలు అన్నీ నకిలీవని, ప్రాజెక్టు నిర్మాణ విషయంలో జీపీల్లో ఎలాంటి తీర్మానాలు చేయలేదని ముంపు గ్రామాల సర్పంచులు పేర్కొన్నారు. కాదు.. పోదు అని ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేయాల్సి వస్తే మమ్మల్ని చంపి నిర్మించుకోవాలని చెప్పారు. అదేవిధంగా మంచిప్ప గ్రామం పూర్తిగా అభివృద్ధిలో కుంటు పడిపోయే అవకాశం ఉంటుందని, ఆ గ్రామానికి ఆనుకుని ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. వారికి ఎలాంటి పరిహారం రాకపోగా, తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఇచ్చిన బర్రె, గొర్రెలను ఎక్కడ మేపాలని, మా భూములు ప్రాజెక్టులో పోతున్నాయని, అందుకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ప్రాజెక్టు తప్పకుండా నిర్మించాలని ప్రభుత్వం అనుకుంటే మా భూమికి బదులు భూమి, ఇల్లుకు బదులు ఇల్లు నిర్మించి ఇవ్వాలని, అప్పుడే ఇక్కడి నుంచి కదులుతామని తేల్చిచెప్పారు. లేకుంటే మిలిటెంట్‌పోరాటానికైనా సిద్ధమన్నారు. అలా కాకుండా అధికారులు సర్వే, ఇతర పనులు అని ముందుకెళ్తే తర్వాత జరిగే పరిణామాలకు తాము బాధ్యులం కాదని స్పష్టం చేశారు. ఒక దశలో అధికారులు, ముంపు గ్రామాల ప్రజలకు వాగ్వాదం చోటుచేసుకుంది. బాధితులు అధికారులపైకి దూసుకువచ్చేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ముంపు గ్రామాల ప్రజలందరూ కలిసి రిజర్వాయర్ నిర్మాణం ఈ ప్రాంతంలో వద్దని, దీని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
నిజామాబాద్‌రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ సతీష్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రభాకర్ రెడ్డి, ప్రాజెక్టు డీఈ గంగాధర్, ఆర్‌ఐ నారాయణ, ఏఈలు ప్రశాంత్, సుధాకర్, గంగాభూషణ్, ప్రజాసంఘాల నా యకులు ప్రభాకర్, సుధాకర్, రవీందర్, సా యాగౌడ్, సర్పంచులు సునీత, బర్మల్, సంజీవ్‌గౌడ్, ఎంపీటీసీలు దిలీప్, వెంకట్రాంనాయక్, ముంపు గ్రామాల బాధితుల కమిటీ ఛైర్మన్ ఈశ్వర్‌సింగ్, శంకర్‌నాయక్, రతన్ సింగ్, రా ములునాయక్, భూపతిరెడ్డి, మంచిప్ప వీడీసీ అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు రవి, భూలోకం, ఒడ్డె రాజన్న, సంగయ్య, మంచిప్ప, కాల్పో ల్, అమ్రాబాద్, తండావాసులు పాల్గొన్నారు.
ఇజ్రాయిల్ టెక్నాలజీతో నీటి సరఫరా
కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం సీడబ్ల్యూసీకి పంపించిందన్నారు. అందులో ఎక్కడా రిజర్వాయర్ల అంశం చేర్చలేదు. జలాశయాల నిర్మాణ అవకాశాలను పరిశీలించాలని కోరింది. అందులోభాగంగానే మంచిప్ప రిజర్వాయర్. పాత డిజైన్ కంటే రీ డిజైన్ ద్వారా చేపడుతున్న ప్రాజెక్టు పనుల ద్వారా ఆయకట్టు దాదాపు లక్ష ఎకరాలకుపైనే పెరుగుతుంది. ఏడు జిల్లాలకు సాగునీరు అందుతుంది. దేశంలో మధ్యప్రదేశ్ తర్వాత మన రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఇజ్రాయిల్ టెక్నాలజీ ద్వారా సాగునీటిని అందిస్తున్నాం. ఈ ప్రాంతంలో 3.5 టీఎంసీల సామర్థ్యంలో జలాశయం నిర్మాణానికి అనుమతులు ఇప్పటికే వచ్చేశాయి. ప్రభుత్వం నిధులు సైతం మంజూరు చేసింది. జలాశయంలో 2 వేల ఎకరాలు ముంపునకు గురవుతుందని ప్రాథమికంగా అంచనాకొచ్చాం. సర్వే చేయాల్సి ఉంటుంది. గత ప్యాకేజీ కంటే అదనంగా రూ.375 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది. దీని వల్ల ఈ ప్రాంతం టూరిజంగా అభివృద్ధి చెందడమే కాకుండా, భూగర్భజలాలు పెరగుతాయి. రెండోపంటకు కూడా నీటికి ఢోకా ఉండదు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు కృతనిశ్చయంతో ఉంది.
– ఆత్మారాం, ప్రాజెక్టు ఈఈ
చట్టప్రకారం ప్రభుత్వం ముందుకెళ్తోంది..
మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం విషయంలో ప్రభుత్వం చట్టప్రకారం ముందుకెళ్తుందని ఆర్డీవో వినోద్‌కుమార్ తెలిపారు. ముంపు బాధితులకు అన్నిరకాల నష్టపరిహారం అందజేస్తామన్నారు. ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, తగిన విధంగా న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. జీవో నెంబర్ 120 ప్రకారం బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు. భూములకు ప్రభుత్వ ధర కంటే రెండింతలు ఎక్కువ, పండ్ల చెట్లు, బోరు, ఇల్లు, ఉపాధి, చేతివృత్తులు, తదితర వాటికి తగిన పరిహారం ఇస్తుందని చెప్పారు. త్వరలోనేముంపు గ్రామాలు, తండాల్లో సర్వే చేయడానికి బృందాలను ఏర్పాటు చేయనున్నామని, వారు ఇంటింటికీ వచ్చి సర్వే చేస్తారన్నారు. చట్టప్రకారం ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతాయని అన్నారు.
– వినోద్‌కుమార్, నిజామాబాద్ ఆర్డీవో
Comments
Please login to add a commentAdd a comment