వ్యక్తి దారుణహత్య
- మ్యారేజ్‌డే రోజునే వెలుగులోకి..
- స్నేహితులపైనే అనుమానం
జియాగూడ, న్యూస్‌లైన్: దుండగులు ఓ వ్యక్తి ముఖంపై బరువైన వస్తువుతో దాడి చేసి హత్య చేశారు. హతుడి మ్యారేజ్‌డే రోజునే (ఆదివారం) ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. కుల్సుంపుర ఇన్‌స్పెక్టర్ ఆర్. కరణ్‌కుమార్‌సింగ్ తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక వెంకటేశ్వరనగర్‌లోని ఓ భవనం 3వ అంతస్తులో ఆటో డ్రైవర్ వి.రాజేష్ అలియాస్ రాజు (33) నివాసముంటున్నాడు.
ఇతనికి భార్య సంతోషిని, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్కూళ్లకు వేసవి సెలవులు కావడంతో పిల్లలను తీసుకొని సంతోషిని ఈనెల 22న కర్మన్‌ఘాట్ అల్మాస్‌గూడలో ఉంటున్న పిన్ని ఇంటికి వెళ్లింది. దీంతో రాజు ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం నుంచి అతను కనిపించకపోవడంతో భార్య వద్దకు అల్మాస్‌గూడ వెళ్లి ఉంటాడని ఇరుగుపొరుగు వారు అనుకున్నారు. కాగా ఆదివారం మ్యారేజ్ డే కావడంతో సంతోషిని ఉదయమే జియాగూడలోని ఇంటికి చేరుకుంది.
బయట నుంచి తలుపు గడియపెట్టి ఉండటంతో తీసి చూడగా.. భర్త రాజు రక్తపు మడుగులో పడి మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగులు అతడిని బరువైన వస్తువుతో ముఖంపై బలంగా కొట్టి, హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చారు.
శుక్రవారం సాయంత్రం హత్య జరిగి ఉంటుందని, ఇద్దరు లేదా ముగ్గురు ఈ ఘటనలో పాల్గొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. స్నేహితులే రాజును చంపి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని గోషామహల్ ఏసీపీ రాంభూపాల్‌రావు పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఎస్‌ఐ శాంతారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.