చాలా మంది టచ్‌లో ఉన్నారు.. | Many other Party candidatesTouch with BJP | Sakshi
Sakshi News home page

చాలా మంది టచ్‌లో ఉన్నారు..

Published Tue, Jul 16 2019 11:33 AM | Last Updated on Sun, Sep 22 2019 1:51 PM

Many other Party candidatesTouch with BJP - Sakshi

మాట్లాడుతున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు  

సాక్షి, హన్మకొండ(వరంగల్‌) : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన చాలా మంది నాయకులు బీజేపీలో చేరేందుకు తనతో టచ్‌లో ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సానీ మురళీధర్‌రావు అన్నారు. ఆ పేర్లు ఇప్పుడే వెల్లడించలేనని, పత్రికలు, మీడియాకు ముందుగా తెలిపిన తర్వాతే పార్టీలో చేర్చుకుంటామన్నారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పని చేసే వారు ఎవరైనా బీజేపీలో చేరొచ్చన్నారు. హన్మకొండ హంటర్‌ రోడ్డులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మురళీధర్‌రావు మాట్లాడారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం, నిజమైన ప్రతిపక్షం బీజేపీయేనని అన్నారు. రాష్ట్రంలో పార్టీని రాజకీయంగా, సంస్థాగతంగా బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత తెలంగాణపై జాతీయ నాయకత్వం దృష్టి సారించిందన్నారు.  ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎనిమిది వేల మంది కార్యకర్తలు ఏడు రోజులు క్షేత్రస్థాయిలో ఉండి ఒక్కో కార్యకర్త ఐదు పోలింగ్‌ బూత్‌లు పర్యవేక్షిస్తూ పార్టీ నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేస్తారన్నారు. 

కేంద్రం నిధులు వినియోగించని రాష్ట్రం
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రానికి నిధులు ఇచ్చినా వినియోగించుకోలేదని మురళీధర్‌రావు విమర్శించారు. ప్రధాని ఆవాస్‌ యోజన, ఆయుష్మాన్‌ భారత్, కేంద్ర ప్రభుత్వ ఇళ్ల పథకాలను అమలు చేయడం లేదని వివరించారు. రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌ ఎన్ని ఇళ్లు ఇచ్చారో నిలదీస్తామని అన్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరు ఎక్కడికక్కడ ఎండగడుతామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 25, 26 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మునిసిపల్‌ కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, వైపల్యాలు ఎండగడుతూ నిరసనలు, 30వ తేదీన అవినీతి వ్యతిరేక దినాన్ని జరుపనున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్‌ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రులు కావాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, నాయకుల వంగాల సమ్మిరెడ్డి, చాడా శ్రీనివాస్‌రెడ్డి, రావుల కిషన్, దొంతి దేవేందర్‌రెడ్డి, కొలను సంతోష్‌రెడ్డి, సంగని జగదీశ్వర్, గండ్రాతి యాదగిరి, గండ్ర సత్యనారాయణ, మార్టిన్‌ లూథర్, కుసుమ సతీష్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement