అభయారణ్యంలో ఎన్‌కౌంటర్‌ | Maoist Linganna Killed in Encounter With Telangana Police | Sakshi
Sakshi News home page

అభయారణ్యంలో ఎన్‌కౌంటర్‌

Published Thu, Aug 1 2019 2:41 AM | Last Updated on Thu, Aug 1 2019 10:05 AM

Maoist Linganna Killed in Encounter With Telangana Police - Sakshi

సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాలో కీలక నక్సల్‌ నేత ఎన్‌కౌంటర్‌తో ఏజెన్సీ ఉలిక్కిపడింది. సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ (రాయల వర్గం) ఖమ్మం, వరంగల్‌ రీజినల్‌ కార్యదర్శి, ఆపార్టీ అజ్ఞాత దళాల కమాండర్‌ పూనెం లింగన్న అలియాస్‌ శ్రీధర్‌ హతమయ్యారు. బుధవారం తెల్లవారుజామున గుండాల మండలంలోని రోళ్లగడ్డ–దేవళ్లగూ డెం గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో పందిగుట్ట వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో లింగన్న మృతి చెందగా, మరో ఆరుగురు తప్పించుకున్నారు.

లింగన్నతోపాటు ఏరియా కమాండర్‌ గోపి, మరో ఐదుగురు దళ సభ్యులు 3 రోజులుగా అక్కడ మకాం వేశారు. పోలీసు బలగాలు కొన్ని రోజులుగా అదేప్రాంతంలో కూంబింగ్‌ చేస్తున్నాయి. లింగన్న దళం అక్కడ ఉన్న ట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం తెల్లవారుజామున ఆ ప్రాం తానికి చేరుకున్నారు. దీంతో పోలీసులకు, లింగన్న దళానికి మధ్య ఎదురుకాల్పులు జరగ్గా.. లింగన్న మృతిచెందాడు. ఏరియా కమాండర్‌ గోపి, మరో ముగ్గురు దళసభ్యులు పారిపోయారు. మరో ఇద్దరు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

పోలీసులపై రాళ్లదాడి 
ఉదయం 7 గంటల సమయంలో లింగన్న ఎన్‌కౌంటర్‌ జరగ్గా..మధ్యాహ్నం వరకు పూర్తిస్థాయిలో సమాచారం బయటకు రాకపోగా.. సంఘటన స్థలానికి ప్రజలను, మీడియాను పోలీసులు వెళ్లనివ్వలేదు.   లింగన్న సొంతూరు రోళ్లగడ్డ కావడంతో ఆ ప్రాం తంలో తీవ్ర అలజడి నెలకొంది. గుండాల మండలంలోని రోళ్లగడ్డ, లింగగూడెం, దేవళ్లగూడెం, పోలిరెడ్డిగూడెం తదితర గ్రామాలకు చెందినవారు అటవీ ప్రాంతం వద్దకు చేరుకున్నారు. సంఘటనాస్థలంలో వంట సామగ్రి తప్ప ఏమీ కనిపించలేదు. తమ అదుపులో ఉన్న మరో ఇద్దరు దళసభ్యులతో లింగన్న మృతదేహాన్ని మోయిస్తూ.. మరో మార్గం గుండా పోలీసులు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన ప్రజలు ఆగ్రహంతో రాళ్ల దాడి చేయగా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.

పోలీసులు తప్పించుకునేక్రమంలో లింగన్న మృతదేహాన్ని, అదుపులోకి తీసుకున్న ఇద్దరు దళ సభ్యులను వదిలి వెళ్లారు. దీంతో ఆ ఇద్దరు దళసభ్యులు గ్రామస్తుల్లో కలిసిపోయి తప్పించుకున్నారు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చిన పోలీసులు ఆరు, ఏడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గ్రామస్తులను చెదరగొట్టారు. ఈ క్రమంలో పలువురు మీడియా ప్రతినిధులపై సైతం పోలీసులు చేయిచేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గుండాలకు రాకుండా వేరే మార్గంలో లింగన్న మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు పందిగుట్ట పక్కన గుట్టపై న్యూడెమోక్రసీ లింగన్న దళాలకు సంబంధించి మరో రెండు మృతదేహాలు ఉన్న ట్లు సమాచారం. ఈ మేరకు స్థానిక పోలీసులు న్యూడెమోక్రసీ నాయకులకు సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.  

20 నెలల తర్వాత ఇల్లెందు ఏజెన్సీలో.. 
ఇల్లెందు డివిజన్‌ పరిధిలోని ఏజెన్సీలో 20 నెలల తర్వాత ఎన్‌కౌంటర్‌ జరిగింది. 2017, డిసెంబర్‌ 14న టేకులపల్లి మండలంలోని చింతోనిచెలక–మేళ్లమడుగు అటవీప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో 9 మంది సీపీబాట (చండ్ర పుల్లారెడ్డి బాట) దళసభ్యులు మృతిచెం దారు.  కాగా, ఉద్యమంలో 20ఏళ్లకు పైగా ప్రస్థా నం కలిగిన, అజ్ఞాతదళాలకు కమాండర్‌గా ఉన్న లింగన్న మృతితో సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీలో ఆందో ళన నెలకొంది.

ఆపార్టీ కీలకనేత ఆవునూరి మధు బుధవారం వరంగల్‌ జైలు నుంచి విడుదల కాగా.. కొన్ని గంటల ముందే లింగన్న ఎన్‌కౌంటర్‌ కావడంతో నేతలు ఆందోళన చెందుతున్నారు. కొంతకాలం జైలులో ఉండి వచ్చారు. తిరిగి గత ఏప్రిల్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ముందే అజ్ఞాతంలోకి వెళ్లారు. లింగన్నను అరెస్ట్‌ చేసే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు ఏకపక్షంగా చంపేశారని ఎన్డీ నేత, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, రీజియన్‌ కార్యదర్శి ఆవునూరి మధు ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో నిరసన చేపట్టారు. 

ఎన్‌కౌంటర్లతో ఉద్యమాలను ఆపలేరు 
లింగన్న ఎన్‌కౌంటర్‌ను సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా గిరిజన హక్కుల కోసం పోరాడుతూ వారికి అండగా నిలబడుతున్న కమాండర్‌ లింగన్నను ఎలాంటి హెచ్చరికలు లేకుండానే కాల్పులు జరిపి హత్య చేశారని ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 

సిట్టింగ్‌ జడ్జితో విచారించాలి 
సాక్షి, హైదరాబాద్‌:  సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకుడు లింగన్నను పోలీసులు కాల్చి చంపడంపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని వివిధ వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. ఇది ఎన్‌కౌంటర్‌ కాదని, పోలీసులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని సీపీఎం నేత తమ్మినేని వీర భద్రం అన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్‌ తర్వాత ఆరు పోలీస్‌స్టేషన్లలో ప్రజలను నిర్బంధించారని  న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు తెలిపారు. పోడు భూముల కోసం ఉద్యమించిన నేతను చంపడ మంటే ప్రజలపై యుద్ధం చేయడమే అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement