భయపడ్డట్టుగానే...
హత్యకు గురైన‘కొనపురి’
భువనగిరి/వలిగొండ, న్యూస్‌లైన్, మావోయిస్టు అగ్రనేత సాంబశివుడి సోదరుడైన రాములు తన హత్యకు కుట్ర పన్నారని మొదటినుంచీ చెబుతున్నట్టుగానే జరిగిపోయింది. రాములు మావోయిస్టు దళంలో పనిచేసి లొంగిపోయారు. జిల్లాలోని ఆలేరు, కృష్ణపట్టి దళాల్లో పనిచేసిన ఆయనపై జిల్లాలో 9 పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇతను 1998లో దళంలో చేరాడు. ఆలేరు, కనగల్లు దళాల్లో పనిచేశాడు. 2001 నుంచి 2002 వరకు కృష్ణపట్టి దళంలో, 2002 నుంచి 2003 వరకు స్పెషల్ గెరిల్లా కమాండర్‌గా పనిచేశాడు. 2001, 2003లో చందంపేట వద్ద మావోయిస్ట్‌లు నిర్వహించిన ట్రైయినింగ్ కాంపులలో పాల్గొన్నాడు. 2003లో ఎస్పీ సజ్జనార్ సమక్షంలో లొంగిపోయాడు. తిరిగి 2006లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. 2007లో లొంగిపోయాడు. 2008లో టీఆర్‌ఎస్‌లో పార్టీలో చేరాడు. రాములపై పలుమార్లు హత్యా ప్రయత్నాలు జరిగినా చాకచక్యంగా తప్పించుకున్నారు.
దళసభ్యురాలినే వివాహం..
దళంలో ఉన్న సమయంలోనే చండూరు మండలం కొండాపురానికి చెందిన దళ సభ్యురాలు కవితను వివాహామాడాడు. ఆయనకు కూతురు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్తపేట సమీపంలో నివసిసిస్తున్నారు. భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని ఆశించారు. అది దక్కుతుందో లేదోనని ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో జెడ్పీటీసీగా పోటీ చేయాలని ఆశించారు. కానీ చివరి నిమిషంలో నిర్ణయాన్ని మానుకున్నారు.
రెండుసార్లు హత్యాయత్నం
అయితే 2008 సంవత్సరంలో ఆయనపై రెండు సార్లు హత్యాయత్నం జరిగింది. ఆయన స్వగ్రామమైన వలింగొండ మండలం దాసిరెడ్డి గూడెంలో కోబ్రాల పేరుతో ఇంట్లో విషసర్పాలను వదిలారు. మరోసారి అన్నంలో విషం కలిపారు. రెండు సార్లు ఆయన బయటపడ్డారు. హైదాబాద్‌లో ఒకసారి, భూదాన్‌పోచంపల్లి మండలం అంతమ్మగూడెంలో బహింరంగ సభలో హత్యాయత్నానికి ప్రయత్నించారు. కోనపురి రామలు సోదరుడు మాజీమావోయిస్టు నేత, టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు సాంబశివున్ని 2011లో మార్చిలో వలిగొండ మండలం గోకారం స్టేజేవద్ద కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అనాటి నుంచి రాములు తనకు ప్రాణ హాని ఉందని చెబుతూ వచ్చారు.
గ్రామంలో విషాదఛాయలు...
రాములు హత్య సమాచారంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొడుకు హత్య జరిగిందన్న సమాచారంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ప్రత్యేక వాహనంలో జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. గ్రామస్తులు తండోపతండాలుగా ఆ ఇంటికి వచ్చి సానుభూతి ప్రకటించారు. మండలకేంద్రంలో టీఆర్‌ఎస్ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.