మరణాలకు దారితీస్తున్న ఇష్టంలేని వివాహాలు
{పేమ పెళ్లిళ్లు కాదన్నందుకు ఆత్మహత్యలు
కౌమార ప్రాయంలో తప్పటడుగులు
తల్లిదండ్రుల మాటలు వినకుండా ప్రేమ,పెళ్లి అంటూ కొందరు పిల్లలు.. పిల్లల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా కొందరు తల్లిదండ్రులు... పంతాలకు పోయి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ప్రేమో, ఆకర్షణో తెలియని వయసులో కొందరు మాటను నెగ్గించుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కామారెడ్డిలో మంగళవారం చోటుచేసుకున్న రెండు సంఘటనలను అటు తల్లిదండ్రులను, ఇటు పిల్లలను ఆందోళన కలిగిస్తున్నాయి.
ఒకవైపు చదువులో మగపిల్లలను వెనక్కు తోస్తూ ముందుకు వెళుతున్న ఆడపిల్లలు మరోవైపు ఆకర్షణ వలలో పడి విలవిల్లాడుతున్నారనడానికి ఈ సంఘటనలు నిదర్శనంగా చెప్పవచ్చు. కన్నవారితో తమ అభిప్రాయాలను కచ్చితంగా చెప్పలేక కొందరు, చెప్పినా తమ మాట పట్టించుకోలేరని మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మూడు నెలల క్రితం కామారెడి పట్టణానికి సమీపంలో వర్ని మండలానికి చెందిన ప్రేమజంట రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరూ చదువుకుంటున్నవారే. అప్పటి నుంచి ఇప్పటి వరకు పది మంది వరకు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజాగా పట్టణంలోని బతుకమ్మకుంటలో అమ్మమ్మ ఇంట్లో ఉండి ఇంటర్ సెకండియర్ చదువుకుంటున్న మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన తోకల మానస(18) అనే విద్యార్థిని మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మానస ఆత్మహత్యకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల మానసకు హైదరాబాద్‌లో ఓ పెళ్లి సంబందం చూశారు. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మానస కుటుంబ సభ్యులతో మొత్తుకున్నా బాధ్యత తీర్చుకునేందుకు ప్రయత్నించారు. దీంతో మనస్థాపానికి గురైన మానస పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి యాదగిరి గల్ఫ్‌దేశంలో ఎన్నో కష్టాలు పడుతూ పిల్లలకు మంచి చదువు అందించేందుకు ప్రయత్నించాడు. పెరిగిన పిల్లకు పెళ్లి చేసి ఇస్తే బాధ్యత తీరుతుందనుకున్నారు. కాని పెళ్లి ఇష్టంలేని కూతురు తల్లిదండ్రులతో పేగుబంధాన్ని తెంపుకుని కానరాని లోకాలకు వెళ్లి వారికి కడుపుకోత మిగిల్చింది. మంచి సంబంధం వచ్చినపుడు పెళ్లి చేయాలనుకున్న ఆ తల్లిదండ్రులకు పుట్టెడు దు:ఖం మిగిలింది. ఇదే రోజు కామారెడ్డి మండలం లింగాయపల్లిలో ప్రేమించిన యువకునితో పెళ్లి జరగదన్న ఆందోళనతో ఇంటర్ ఫస్టియర్ చదివే అనిత అనే యువతి ఎండ్రిన్ గుళికలు మింగి ఆస్పత్రి పాలైంది. సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం తప్పింది.
మూడు నెలల క్రితం పరిచయమైన యువకుడితో ప్రేమలో పడిన అనిత పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. అయితే అనిత కుటుంబ సభ్యులు సదరు యువకున్ని పిలిపించి తల్లిదండ్రులను తీసుకువస్తే మాట్లాదామని పంపించారు. కులాలు వేరుకావడంతో ఆ యువకుని తల్లిదండ్రులు నిరాకరించినట్టు సమాచారం. ఇదే విషయంలో మంగళవారం ఉదయం సదరు యువకుడు తనను మరిచిపొమ్మంటూ ఫోన్ చేశాడని, దీంతో తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు అనిత పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చింది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరగదేమోనని భయంతో ఇలా చేశానని తెలిపింది. కౌమారదశలో ఉన్న పిల్లల విషయంలో కళాశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు జీవితపాఠాలు బోధించడం ద్వారా వారిని మంచి బాటలో నడిపించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా చర్యలు మొదలుపెట్టాలని పలువురు కోరుతున్నారు.
అను‘బంధం’ తెగుతోంది..
Published Wed, Nov 12 2014 3:25 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
Advertisement