మహమ్మారి మట్కా | Matka is going in district | Sakshi
Sakshi News home page

మహమ్మారి మట్కా

Published Mon, Sep 14 2015 3:36 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Matka is going in district

- మహారాష్ట్ర కేంద్రంగా జిల్లాలో జోరుగా హైటెక్ జూదం    
- కోట్లు దాటుతున్న దందా, రాజకీయ నాయకుల అండ
- మట్కా నగదులో ఖాకీల కక్కుర్తి
ఆదిలాబాద్ క్రైం :
జిల్లాలో మట్కా మహమ్మారి కోరలు చాస్తోంది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా సగటు జీవి జీవితాన్ని నాశనం చేస్తోంది. వ్యాపారులు, కూలీలు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, యువత మట్కాకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మట్కాకు బానిసై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలూ జిల్లాలో చోటు చేసుకున్నాయి. రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్మును జూదంలో పెట్టడంతో కుటుంబ పోషణ భారమై జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. పోలీసులు అడపాదడపా దాడులు జరిపినా మట్కాను నియంత్రించలేకపోతున్నారు. ఒకరిద్దరిని అదుపులోకి తీసుకుని.. నిర్వాహకులపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిర్వహకుల నుంచి మమూళ్లు అందడంతో పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
 
కోట్లలో వ్యాపారం..
మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, బాసర, బోథ్, చెన్నూర్, మంచిర్యాల, కాగజ్‌నగర్ పట్టణాల్లో మట్కా జోరుగా సాగుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో యువత కూడా మట్కాజూదం వైపు ఆకర్షితులవుతున్నారు. జిల్లాలో ప్రతి ఏడాది కోట్ల రూపాయలు మట్కాతో చేతులు మారుతున్నాయి. ముంబయి కేంద్రంగా మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో కళ్యాణి, మిలాన్, ముంబాయి, రాజధాని వంటి కంపెనీలు మట్కా నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీల్లో జిలా ్లకు చెందిన వారూ పాల్గొంటున్నారు. రూ.పదికి రూ.వెయ్యి వస్తుండడంతో యువత అత్యాశకు పోయి మట్కాకు అలవాటు పడుతున్నారు.

ఓపెనింగ్, క్లోజింగ్ నంబర్లపై బ్రాకెట్ నెంబర్‌కు వందరేట్ల చెల్లింపుతో మట్కా జూదం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఓపెన్, సాయంత్రం 6 గంటలకు క్లోజింగ్ ఉంటుంది. మనం ఎంపిక చేసిన నెంబర్‌కు లాటరీ తగిలితే మళ్లీ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో లాటరీ తగిలేవారు తక్కువ శాతం.. డబ్బులు పోగొట్టుకునే వారే అధికంగా ఉంటారు. కార్మికుల నుంచి కాంట్రాక్టర్లు.. వ్యాపారుల నుంచి రాజకీయ నాయకుల వరకు మట్కా జూదంలో పాత్రధారులే. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా మట్కాలో డబ్బులు పెడుతున్నారంటే అతిశయోక్తి కాదు. కొన్ని రోజులుగా జిల్లాలో మట్కాజూదరుల అరెస్టులను చూస్తే ఏ మేర మట్కా జరుగుతుందో తెలిసిపోతోంది.
 
సెల్‌ఫోన్ ద్వారా ఫలితం..

సెల్‌ఫోన్ మెసేజ్‌ల ద్వారానే ఫలితాలు వెల్లడిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి సెల్‌ఫోన్ మెసేజ్ ద్వారా ఈ మట్కా జోరుగా సాగుతోంది. ఒకప్పుడు చిట్టీలపై నంబర్లతో సాగిన ఈ దందా సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో విచ్చలవిడిగా సాగుతోంది. చిట్టీలతో కాకుండా సెల్‌ఫోన్ మెసేజ్‌లతో మట్కా ఆడుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో లక్షల్లో జరిగే మట్కా వ్యాపారం ప్రస్తుతం జిల్లాలో కోట్ల రూపాయల్లో కొనసాగుతోంది. పోలీసుల నిఘా పెరగడంతో జిల్లా కేంద్రంగా రోజు రూ.20 నుంచి 30 లక్షల వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని యావత్‌మాల్, పాండ్రకవడ, చంద్రపూర్, మాం డ్వ, తదితర ప్రాంతాల నుంచి మట్కా సాగుతోంది. మన రాష్ట్రంలోని కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచి కూడా జిల్లాలో మట్కా సాగుతోంది. సరిహద్దుల్లో జోరుగా సాగుతున్న ఈ మట్కా వ్యాపారాన్ని జిల్లా పోలీసులతోపాటు అంతర్రాష్ట్ర పోలీసుల నిఘాతోనైనా అరికట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
 
ఖాకీల కక్కుర్తి..
జిల్లాలో కొంతమంది పోలీసు సిబ్బంది సహకారంతోనే ఈ మట్కా విస్తరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అప్పుడప్పుడు దాడులు చేసి మట్కా నిరోధానికి చర్యలు తీసుకుంటున్న ట్లు నిరూపించినా.. అసలు మూలాల్లోకి వెళ్లడం లేదని తెలుస్తోంది. ఇటీవల కాలంలో మట్కా నిర్వాహకులను అరెస్టు చేస్తున్న పోలీసులు స్వాధీనం చేసుకున్న సొమ్ములో కక్కుర్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అధిక మొత్తంలో మట్కా నగదు దొరికినా తక్కువ సంఖ్యలో చూపించి మిగతాది నొక్కేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్కా కేసును పట్టుకున్న పోలీసు అధికారి వచ్చిన సొమ్ములో తనతోపాటు కేసును పట్టుకొచ్చిన సిబ్బందికి కూడా వంతుల వారీగా డబ్బులు చెల్లిస్తున్నారనే విమర్శలున్నాయి. రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలో రూ.2.64 లక్షల మట్కా నగదు దొరికినప్పటికీ నాలుగు రోజులు బయటపెట్టకుండా గోప్యంగా ఉంచడం గమనార్హం.
 
నిఘా ఏర్పాటు చేశాం..
మట్కా జూదం నిర్మూలనపై నిఘా ఏర్పాటు చేశాం. జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రత్యేక దృష్టి సారించాం. మహారాష్ట్ర నుంచి నడిచే మట్కా దందాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. మట్కా నిర్వహిస్తున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గణేష్ ఉత్సవాల్లో కూడా మట్కా, పేకాట ఆడినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలి.
- లక్ష్మీనారాయణ, ఆదిలాబాద్ డీఎస్పీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement