'గ్రేటర్ పీఠం మాదే' | mayer seat is ours, says KCR | Sakshi
Sakshi News home page

'గ్రేటర్ పీఠం మాదే'

Published Fri, Jan 29 2016 3:30 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

'గ్రేటర్ పీఠం మాదే' - Sakshi

'గ్రేటర్ పీఠం మాదే'

 హైదరాబాద్‌ను డల్లాస్, వాషింగ్టన్, బీజింగ్ సరసన నిలబెడతాం
 ఇన్నాళ్లూ పాలించినవారే మళ్లీ ఓట్లడుగుతున్నారు
 అరవై ఏళ్లలో వారేం చేశారు? తాగడానికి రక్షిత నీరు కూడా ఇవ్వలేదు
 మూసీని మురికి కూపంగా మార్చారు..  హుస్సేన్‌సాగర్‌ను కాసారంలా చేశారు
 1,100 చెరువులకు ఇప్పుడు.. 119 మాత్రమే మిగిలాయి
 మేం పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్తున్నాం
 జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కొత్త సచివాలయ భవనాలకు శంకుస్థాపన
 ఉస్మానియా ఆసుపత్రిలో పురాతన కట్టడాల జోలికి పోం
 ఖాళీ స్థలంలో రెండు భారీ టవర్లు నిర్మిస్తాం: సీఎం కేసీఆర్

 
 సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పీఠం టీఆర్‌ఎస్ దక్కించుకుంటుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ధీమాగా చెప్పారు. హైదరాబాద్‌ను డాలస్, వాషింగ్టన్, బీజింగ్ వంటి అంతర్జాతీయ నగరాల సరసన నిలబడేలా విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టంచేశారు. గురువారమిక్కడ ఆయన ఈ-పబ్లిసిటీ కార్యక్రమంలో భాగంగా విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ ఎన్నికల్లో మేం (టీఆర్‌ఎస్) తప్ప అన్నీ పాత పార్టీలే.
 
ఇన్నాళ్లు పాలించిన వారే మళ్లీ ఓట్లడుగుతున్నారు. వారి పాలనలో ఏం ఒరిగింది? విద్యుత్ కోసం 30 ఏళ్లు గోస పడ్డం. ఇన్వర్టర్లు.. కన్వర్టర్లు.. స్టెబిలైజర్లు.. జనరేటర్లు ఇంతేగా... అరవై ఏళ్లలో ఏం జరిగింది? రక్షిత నీరివ్వలేని పరిస్థితికి తెచ్చారు. మూసీని మురికి కూపంగా మార్చారు. హుస్సేన్‌సాగర్‌ను కాలుష్య కాసారంగా మార్చారు. నాలాలు కబ్జాలు, భూ కబ్జాలు.. వీటన్నిటికీ వీరే కారణం. మళ్లీ వారే ఓట్లేయమని వస్తున్నరు. దీనిపై జంట నగరాల ప్రజలు విశ్లేషించుకోవాలి..’’ అని సీఎం అన్నారు.
 
చెరువులు ఎవరి హయాంలో మాయమయ్యాయి?
హైదరాబాద్ అనేక అంశాల్లో ఉండాల్సిన స్థాయిలో లేదని, మౌలిక సౌకర్యాలు సరిగా లేవని సీఎం అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో రూ.200 కోట్లతో వివిధ పనులు చేపట్టినట్లు వివరించారు. ‘‘సిటీ ఆఫ్ లేక్స్ అని పేరున్న హైదరాబాద్‌లో 1,100 చెరువులు, కొలనులు ఉండేవి. ఇప్పుడు 119 మాత్రమే మిగిలాయి. ఇవన్నీ ఎవరి హయంలో మాయమయ్యాయో గమనించాలి. హుస్సేన్‌సాగర్ హైదరాబాద్ వరం. దాన్ని కుళ్లి కంపుకొట్టేలా చేశారు. దీని ప్రక్షాళన కార్యక్రమాన్ని ఆస్ట్రియా కంపెనీకి అప్పజెప్పాం.
 
 కోటి జనాభా ఉన్న నగరంలో యాభై వేల మందికి ఒక మార్కెట్ చొప్పున 200 ఉండాలి. వీటి నిర్మాణానికి ప్రభుత్వం స్థలాలు సేకరించింది. నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. పబ్లిక్ టాయిలెట్స్ నాలుగైదు వందలైనా ఉండాలి. కానీ వందా నూటా యాభై కూడా లేవు. అందుకే 250 టాయిలెట్ల నిర్మాణం మొదలు పెట్టాం. శ్మశాన వాటికల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చాం. నగరంలో చెత్త ఎత్తిపోయడానికి డంపింగ్ యార్డులు లేవు. జవహర్‌నగర్ యార్డును కలుషితం చేశారు. నగరం నాలుగు మూలల్లో నాలుగు స్థలాలు ఎంపిక చేశాం. ఇది చారిత్రక నగరం. కొన్ని పాత భవనాలు కూల్చక తప్పదు. డెబ్రిస్ రీసైకిల్ చేసే చర్యలు తీసుకుంటున్నాం’’ అని సీఎం వివరించారు.
 
రోగుల సహాయకులకు నైట్ షెల్టర్లు
నగరంలోని వివిధ ఆసుపత్రులకు వచ్చే రోగుల సహాయకుల కోసం విశ్రాంతి భవనాలు (నైట్ షెల్టర్లు) నిర్మిస్తామని సీఎం చెప్పారు. దీనిపై ఇప్పటికే ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలతో మాట్లాడినట్టు వివరించా రు. ‘‘బస్తీలో బహుళ ప్రయోజన కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపడతాం. నగరంలో 3,800 సిటీ బస్సుల్లో నిత్యం 40 లక్షల నుంచి 45 లక్ష ల మంది ప్రయాణిస్తున్నా.. సరైన బస్టాపుల్లేవు. కొత్తవాటి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం.
 
ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర మరో బస్సు టెర్మినల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి వద్ద మరో స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల సంఖ్య 10 లక్షలకు చేరుకున్నందున రెండో రన్‌వే నిర్మాణం కోసం జీఎంఆర్‌తో మాట్లాడాం. దేశంలో ఏ నగరానికి లేని హంగులు హైదరాబాద్‌కు ఉన్నాయి. రాజకీయాలకు, వ్యక్తిగత ఇష్టాలకు పోకుండా హెచ్‌ఎండీఏ రీ ఇంజనీరింగ్ జరిగింది. మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం..’’ అని కేసీఆర్ తెలిపారు.
 
 పాజిటివ్ దృక్పథంతో ముందుకు..
 గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ పాజిటివ్ దృక్పథంతో ముందుకు వె ళ్తోందని సీఎం చెప్పారు. ‘ఒక్క విద్యుత్ అంశం చాలు.. మాకు ఓటేయడానికి..’ అని అన్నారు. ‘‘జంట నగరాల్లో గుడిసెలు, రేకుల ఇళ్లలో ఉంటున్న వారికి లక్ష పట్టాలు ఇచ్చాం. ఆటో ట్యాక్స్ రద్దు చేశాం. రూ.70 కోట్ల బకాయిలు మాఫీ చేశాం. 10 లక్షల మంది ఆటో డ్రైవర్లకు, 15 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించాం. ఇన్ని చేస్తున్నా కొన్ని పార్టీల ధోరణి మారడం లేదు. వరంగల్ తీర్పు తర్వాత పద్ధతి మార్చుకోవాలని కోరాను. కానీ మారడం లేదు’’ అని అన్నారు.
 
సచివాలయం ఎర్రగడ్డలోనే..
జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కొత్త సచివాలయం భవనాల సముదాయానికి శంకుస్థాపన చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. బహుశా ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలోనే కొత్త సచివాలయం ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అలాగే ఉస్మానియా ఆస్పత్రిలో పురాతన కట్టడాల జోలికి పోకుండా.. ఖాళీ స్థలంలో రెండు భారీ బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్నికల తర్వాత శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.
 
వివిధ అంశాలపై సీఎం ఏమన్నారంటే..
డబుల్ బెడ్రూం ఇళ్లు: జంట నగర ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు వెయ్యి ఎకరాల స్థలాన్ని గుర్తించాం. వచ్చే ఏడాది లక్ష ఇళ్లు నిర్మించబోతున్నాం. సకల సదుపాయాలతో టవర్లు నిర్మిస్తాం. అద్దె ఇళ్లలో ఉన్న వారికి కూడా డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తాం. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయం ఉండదు. దేశానికి ఆదర్శంగా ఉండేలా జర్నలిస్టులకు కూడా 750-800 చదరపు అడుగుల మేర ఫ్లాట్లు నిర్మించి ఇస్తాం.

విద్యుత్: విద్యుత్ కోసం గతంలో ధర్నాలు జరిగాయి. పవర్ హాలిడేలు ప్రకటించారు. ఇప్పుడు 24 గంటలు పరిశ్రమలకు సరఫరా చేస్తున్నాం. కాంగ్రెస్, టీడీపీలు గతంలో ఈ పని ఎందుకు చేయలేక పోయాయి. టీఆర్‌ఎస్ చేసి చూపెట్టింది. ముంబై తరహాలో ‘ఐలాండ్ పవర్ సిస్టం’ అమలు చేస్తాం. నగరంలో కనురెప్ప పాటు కూడా కరెంటు పోకుండా చూస్తాం.

జంట జలాశయాలు: నగర దాహార్తి తీర్చేందుకు 20 టీఎంసీల సామర్థ్యంతో జంట జ లాశయాలు నిర్మిస్తున్నాం. 170 కి.మీ. దూరం నుంచి కృష్ణా, 200కి.మీ. దూరం నుంచి గోదావరి నీళ్లు వస్తున్నాయి.


రహదారుల అభివృద్ధి: రహదారుల అభివృద్ధికి ‘స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్’ సిద్ధంగా ఉంది. బ్రిక్స్ బ్యాంక్ నుంచి రూ.25 వేల కోట్ల రుణం అడిగాం. రూ.30 వేల కోట్లతో హైదరాబాద్‌ను అయిదారేళ్లలో విశ్వనగరంగా తీర్చి దిద్దుతాం. స్కైవేలు, మల్టీ లేయర్ ఫ్లై ఓవర్లు, ట్రాఫిక్ జంక్షన్లను అభివృద్ధి చేస్తాం. స్ట్రామ్ వాటర్ డ్రెయిన్లు లేకపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. రూ.1,100 కోట్లు ఖర్చు పెట్టాలి. కనీసం మూడు నాలుగేళ్ల సమయంలో సమస్య పరిష్కరిస్తాం. నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ (హెచ్‌ఎండబ్ల్యూఎస్) కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement