బంజారాహిల్స్: ప్రేమ ఎలా.. ఎక్కడ.. ఎవరిపై.. ఎందుకు చిగురిస్తుందో అది ప్రేమించినవారికే తెలుస్తుంది. దానికి వయసుతో గానీ, పేదా, గొప్పా తేడాలు గానీ లేవనేందుకు తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతమే ఉదాహరణ. ఆమె వయసు 24.. అతని వయసు 19.. ఆమె ఎంబీఏ చదువుతుండగా. అతను ఏడో తరగతితో చదువుకు స్వస్తి పలికి వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆమె ఐదంతస్తుల భవనంలో నివాసం ఉంటుండగా, అతను రేకుల షెడ్డులో తలదాచుకుంటున్నాడు. అయినా వారి ప్రేమ మధ్య చిగురించింది. ఇరువురి హృదయాలను ఒక్కటి చేసింది. తన ఇంటికి వాటర్ ట్యాంకర్‌తో నీళ్లు తీసుకొచ్చే క్రమంలో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆరు నెలలుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. నాలుగు నెలల క్రితం ఇద్దరూ కలిసి చెప్పాపెట్టకుండా ఇళ్లలోంచి వెళ్లిపోయారు. మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో యువతి తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు హఫీజ్‌పేట్‌లో ఉంటున్న వీరిని స్టేషన్‌కు తీసుకొచ్చి వయసు నిర్ధారణ చేయగా ఆమె మేజర్ అని తేలింది. అతని వయసు 19 కావడంతో మైనర్‌గా తేల్చి ఎవరి ఇళ్లకు వారిని పంపించారు.
ఇదిలా ఉండగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న యువతి తల్లికి వారానికి ఓసారి బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని సెంచురీ ఆస్పత్రిలో డయాలసిస్ జరుగుతోంది. రెండు వారాల క్రితం తల్లికి తోడుగా వచ్చిన సదరు యువతి ఆస్పత్రిలో తల్లికి డయాలసిస్ జరుగుతుండగానే ప్రియుడిని అక్కడికి పిలిపించుకొని అతడితో కలిసి వెళ్లిపోయింది. అదే రోజు యువతి తండ్రి ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి తాజాగా వారిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. తాను ప్రియుడితోనే కలిసి ఉంటానని యువతి మొండికేయగా, మైనర్‌తో పంపేందుకు చట్టం ఒప్పుకోదని పోలీసులు అడ్డు చెప్పారు. దీంతో ఆమెను పునరావాస కేంద్రానికి పంపించారు. ప్రేమించిన వాడితో తనకు దుర్గ గుడిలో పెళ్లి కూడా జరిగిందని ఎలా విడదీస్తారని, ప్రియుడి నుంచి దూరం చేస్తే చచ్చిపోతానని బెదిరించింది. దీంతో ఎటూ పాలుపోని పోలీసులు న్యాయ సలహా తీసుకున్నారు. చట్టప్రకారం సదరు యువతిని ఎక్కడికి పంపించాలంటూ అడగగా ఆమె ఎవరి దగ్గరికి వెళ్లాలని అనుకుంటే అక్కడికే పంపించవచ్చని తెలిపారు. దీంతో శుక్రవారం మరోసారి స్టేషన్‌లో పంచాయితీ నడిచింది. తాను ప్రేమించిన వాడితోనే వెళ్తానంటూ ఆమె చెప్పడంతో పోలీసులు ఆ ప్రకారమే నడుచుకోవాల్సి వచ్చింది. సినిమా సన్నివేశాన్ని తలపించిన ఈ ప్రేమ వ్యవహారం పోలీసులకు గత రెండు వారాలు తలనొప్పిగా మారడంతో ఎటూ నిర్ణయం తీసుకోలేక సతమతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment