మెదక్ ఎంపీ అభ్యర్థుల ఖరారు | Medak MP candidates finalized | Sakshi
Sakshi News home page

మెదక్ ఎంపీ అభ్యర్థుల ఖరారు

Published Wed, Aug 27 2014 12:49 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

మెదక్ ఎంపీ అభ్యర్థుల ఖరారు - Sakshi

మెదక్ ఎంపీ అభ్యర్థుల ఖరారు

టీఆర్‌ఎస్ అభ్యర్థిగా  కొత్త ప్రభాకర్ రెడ్డి
కాంగ్రెస్ నుంచి బరిలోకి సునీతా లక్ష్మారెడ్డి
అర్ధరాత్రి వరకూ చర్చల్లో మునిగిన బీజేపీ
నామినేషన్ దాఖలుకు నేడే తుది గడువు

 
హైదరాబాద్, ఢిల్లీ: మెదక్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు దోబూచులాడిన ప్రధాన పార్టీలు చివరకు తమ నిర్ణయాన్ని ప్రకటించాయి. తమ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి పేరును మధ్యాహ్నమే లీకు చేసిన అధికార టీఆర్‌ఎస్.. ఇతర పార్టీల నిర్ణయం కోసం రాత్రి వరకూ నాన్చి చివరకు ఆయన్నే ఖరారు చేసింది. అయితే అధికారి కంగా మాత్రం ప్రకటించలేదు. అయితే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పలువురు ముఖ్యులతో    మంతనాలు జరిపారు. మరోవైపు కాంగ్రెస్ కూడా రాత్రి 10 గంటల సమయంలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేసింది. దీనిపై సాయంత్రం నుంచే మీడియాలో ప్రచారం జరిగింది. టీఆర్‌ఎస్, బీజేపీల అభ్యర్థిత్వాలపై రోజంతా వేచి చూసిన కాంగ్రెస్ పెద్దలు ఆఖరికి సునీతా లక్ష్మారెడ్డివైపే మొగ్గు చూపారు.

ఆమె పేరును పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీ రాత్రి ఢిల్లీలో ధ్రువీకరించారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకూ సమాచారం అందింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ కూడా సునీ తకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. కాగా, నామినేషన్ల దాఖలుకు బుధవారం చివరి రోజు కావడంతో మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ పత్రాన్ని సమర్పించాలని ఆమె నిర్ణయిం చారు.  బీజేపీ కూడా టీఆర్‌ఎస్ నిర్ణయం వెలువడే వరకు రోజంతా వేచి చూసింది. నిజానికి ప్రభాకర్ రెడ్డినే తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలని కమలనాథులు భావించారు. అయితే ఆయనకు టీఆర్‌ఎస్ టికెట్ ఖరారు కావడంతో అర్ధరాత్రి వరకు బీజేపీ నేతలు చర్చల్లో మునిగిపోయారు. అయినా ఎవరినీ ప్రకటించలేదు. బుధవారం ఉదయం 9 గంటలకు అభ్యర్థిని ప్రకటిస్తామని పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, అంజిరెడ్డి, రఘునందన్‌రావులలో ఒకరిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. మూడు ప్రధాన పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై లీకులతో ప్రత్యర్థి పార్టీలను ట్రాప్‌లో పడే సేందుకు రోజంతా దాగుడుమూతలాడాయి.

దేవీప్రసాద్‌కు ఎమ్మెల్సీ పదవి!

టీఆర్‌ఎస్ నుంచి మెదక్ ఎంపీ సీటును ఆశించిన టీఎన్‌జీఓ అధ్యక్షుడు దేవీప్రసాద్‌కు త్వరలోనే ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా ప్రభుత్వ వర్గాల ద్వారా మీడియాకు మెయిల్‌లో సమాచారం అందింది.
 
ఉప ఎన్నికల్లో 2 వేల మంది కాంగ్రెస్ సైన్యం!
 
మెదక్ ఉప ఎన్నికను కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించి సత్తా చాటాలని భావిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులంతా ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు మెదక్‌లోనే మకాం పెట్టేలా వ్యూహం సిద్ధం చేసింది. అసెంబ్లీ నియోజకవర్గానికో మాజీమంత్రి, మండలానికో ఎమ్మెల్యే, గ్రామానికో ప్రజా ప్రతినిధి చొప్పున పార్లమెంట్ పరిధిలో 2 వేల మందికిపైగా నేతలు పాగా వేసేలా ప్రణాళికను రూపొందించింది. టీపీసీసీ తరపున మరో ప్రతినిధిని కూడా నియమించి.. పది మంది నేతలతో మండలాల వారీగా ఒక టీం ను కూడా ఏర్పాటు చేయనుంది. వీరంతా  ప్రతి గ్రామంలో పర్యటిస్తూ బూత్‌లవారీగా కార్యకర్తలతో సమావేశమై విస్తృత ప్రచారం నిర్వహిస్తారు.   ఆయా మండలాల పరిధిలో సుమారు 700 గ్రామ పంచాయతీలున్నాయి. ఒక్కో గ్రామంలో ఒక్కో జిల్లా, రాష్ట్రస్థాయి నాయకుడిని ఇన్‌చార్జ్‌గా నియమిస్తారు.

  ఇక  కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మెదక్ ఉప ఎన్నికల ప్రచారానికి రావాలని నిర్ణయించినట్లు టీపీసీసీ వర్గాల సమాచారం. వీరిలో ఒకరు సంగారెడ్డిలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొం టారు. మరొకరు సిద్దిపేటలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రియాంకగాంధీని కూడా ప్రచారానికి రప్పించాలని కాంగ్రెస్ నేతలు హైకమాండ్ పెద్దలను కోరినప్పటికీ ఆమె అంగీకరిస్తారా.. లేదా? అనేది  తెలియరాలేదు.  టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్ నామినేషన్ల పర్వం ముగిసిన దగ్గర నుంచి పోలింగ్‌కు ముందురోజు వరకు విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement