మురిసిన మేడారం
ఇలవేల్పుల సేవలో ప్రముఖులు జనసంద్రమైన అమ్మల గద్దెలు
మూడో రోజూ మేడారం జనసంద్రమైంది.. శుక్రవారం భక్తులు అధికంగా తరలివచ్చి సమ్మక్క-సారలమ్మలకు పసుపు, కుంకుమ, ఎత్తుబంగారం (బెల్లం) సమర్పించారు. గిరిజన సంక్షేమశాఖ, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్ దర్శించుకున్నారు. జాతర ప్రారంభం నుంచి సుమారు 1.50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, వనదేవతల సన్నిధిలో హైదరాబాద్‌కు చెందిన వధూవరులు వివాహం చేసుకున్నారు. - మేడారం(తాడ్వాయి)
మేడారం భక్తజన సంద్రమైంది. మొక్కులు, పూజలతో పులకించింది. మేడారం మినీ జాతర మూడో రోజు శుక్రవారం రద్దీ విపరీతంగా పెరిగింది. వనదేవతల చల్లని చూపు కోసం భక్తకోటి తరలివచ్చింది. పసుపు, కుంకుమ, ఎత్తుబంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించారు. గిరిజన సంక్షేమశాఖ, పర్యాటకశాఖ మంత్రి అజ్మీర చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్‌లు అమ్మవార్లను దర్శించుకున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి దేవతల దర్శనానికి వచ్చిన చందూలాల్‌తోపాటు ఎంపీని ఈఓ గోధుమల మల్లేశం, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతించి సత్కారం చేశారు. గతేడాదితో పోల్చితే ఈసారి అధికారులు మెరుగ్గానే ఏర్పాట్లు చేశారని భక్తులు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
- మేడారం(తాడ్వాయి)/సాక్షి ఫొటోగ్రాఫర్ హన్మకొండ