మేడారం(తాడ్వాయి) : మేడారంలోని ఆర్టీసీ బస్టాండ్ శుక్రవారం భక్తులతో కిక్కిరిసింది. నలుగురు దేవతలు గద్దెలపై కొలువుదీరి ఉండడంతో భక్తులు గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా తరలివచ్చారు. మొక్కులు చెల్లించుకున్న తర్వాత శుక్రవారం సాయంత్రం నుంచి తిరుగుపయనమయ్యారు. దీంతో మేడారంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. బస్టాండ్‌లో వివిధ జిల్లాలకు ఏర్పాటు చేసిన పాయింట్ల వద్ద ఆప్రాంతాలకు వెళ్లే బస్సులు సమయానికి లేకపోవడంతో భక్తులు గంటల తరబడి పడిగాపులు కాశారు. ఆర్టీసీ బస్టాండ్ క్యూలైన్లలో భక్తులకు ఆర్టీసీ అధికారులు తాగునీటి వసతి కల్పించారు. బస్టాండ్ ప్రాంగణానికి భక్తులు వేల సంఖ్యలో చేరుకోవడంతో భక్తుల రద్దీతో బస్టాండ్ నిండిపోయింది. ఆర్టీసీ బస్సుల్లో మేడారం జా తరకు వచ్చిన భక్తులు తిరుగుప్రయాణంలో ఆటోలు, ఎడ్లబండ్లను ఆశ్రయించారు.
ఎండకు భక్తుల ఇక్కట్లు
బస్టాండ్ ప్రాంగణంలో భక్తుల నీడ కోసం ఆర్టీసీ అధికారులు చలువ పందిళ్లు ఏర్పాటు చేయలేదు. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చిన భక్తులు గంటల తరబడి ఎండలోనే కూర్చోలేక నరకయాతన అనుభవించారు. భక్తులకు ఇబ్బందులు తలె త్తకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని జాతరకు ముందు చెప్పిన అధికారులు భక్తులకు నీడ కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేయలేదు.
4,717 ట్రిప్పుల ద్వారా 2,17,763 మంది భక్తులు
హన్మకొండ : గురువారం వరకు ఆర్టీసీ బస్సుల ద్వారా మేడారానికి బయల్దేరిన భక్తులు శుక్రవారం నుంచి తిరుగుముఖం పట్టారు. మేడారం బస్సుల్లో వెళ్లిన భక్తుల సంఖ్యను మించి తిరుగు ప్రయాణ భక్తుల సంఖ్య పెరిగింది. శుక్రవారం 3,480 ట్రిప్పుల ద్వారా 72,397 మంది భక్తులు ఆర్టీసీ బస్సుల ద్వారా మేడారం చేరుకోగా 4,717 ట్రిప్పుల ద్వారా 2,17,763 మంది భక్తులు తిరుగుప్రయాణమయ్యారు. ఆర్టీసీ భక్తుల సంఖ్యకు మించి బస్సులు ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులు జాతరకు వెళ్లి వస్తున్నారు.
భక్తులతో కిక్కిరిసిన ఆర్టీసీ బస్టాండ్
Published Sat, Feb 20 2016 1:20 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM
Advertisement
Advertisement