మేడ్చల్ నగర పంచాయతీ రద్దు!
- వారం రోజుల్లో అధికారిక ప్రకటన
- ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు
- 23న వెలువడనున్న నోటిఫికేషన్?
మేడ్చల్ : రెండేళ్లుగా సందిగ్ధంలో ఉన్న మేడ్చల్, అత్వెల్లి గ్రామాల రాజకీయ భవిష్యత్‌కు సెప్టెంబర్ 23వ తేదీ లోపు తెరపడనుంది. రెండేళ్ల క్రితం పై రెండు గ్రామాలను కలిపి గత ప్రభుత్వం మేడ్చల్ నగర పంచాయతీగా మార్చింది. అయితే నగర పంచాయతీ ఎలా చేస్తారంటూ పై గ్రామాలకు చెందిన రాజేశ్వర్‌గౌడ్, మల్లేష్‌గౌడ్‌లు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే విచారణ అనంతరం కోర్టు రెండు గ్రామాలను పంచాయతీలుగా మార్చి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ అధికారులు తిరిగి ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించడంతో పై రెండూ గ్రామాలు నగర పంచాయతీలు ప్రత్యేకాధికారి పాలనలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలు ప్రభుత్వ అధికారులు దిక్కరించారని పై ఇరువురూ మరో పిటిషన్ వేయడంతో న్యాయస్థానం రెండు గ్రామాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. దీంతో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేయాలని మండల పరిషత్ అధికారులను తాజాగా ఆదేశాలు అందాయి. దీంతో వారు సర్వం సిద్ధం చేస్తున్నారు.
అన్ని పూర్తి చేసిన అధికారులు
మేడ్చల్, అత్వెల్లి గ్రామాలకు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి మండల పరిషత్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడ్చల్‌కు 20 వార్డులు, అత్వెల్లికి 12 వార్డులు పునర్విభజన చేసి మేడ్చల్ సర్పంచ్ స్థానాన్ని బీసీ మహిళకు, అత్వెల్లి సర్పంచ్‌కు బీసీ జనరల్‌కు రిజర్వు చేశారు. రెండు రోజుల క్రితం ఓటర్ లిస్టు పబ్లిష్ చేశారు. తాజాగా పోలింగ్ స్టేషన్లను గుర్తించా రు.పంచాయతీ రాజ్ శాఖా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.
23న వెలువడనున్న నోటిఫికేషన్...?
మేడ్చల్, అత్వెల్లి గ్రామాలకు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ఈనెల 23వ తేదిన నోటిఫికేషన్ రానున్నట్లు మండల అధికారుల ద్వారా తెలిసింది. గ్రామాల్లో నోటిఫికేషన్ వస్తుందనే వార్త ఊపందుకోవడంతో సర్పంచ్, వార్డు సభ్యుల కోసం పోటీ చేసే నాయకులు రెండు గ్రామాల్లో జోరుగా రాజకీయాలు నడుపుతూ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రెండు గ్రామాలకు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహంచడానికి అధికారులు అంతా సిద్ధం చేస్తుండడంతో నగరపంచాయతీ రద్దు కానుందని సమాచారం.