22 లేదా 23?
పోలింగ్‌కు ముహూర్తం
ఈ నెల 8 లేదా 9న నోటిఫికేషన్
జోరుగా ఊహాగానాలు
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు దాదాపుగా ముహూర్తం ఖరారైందా? ఈ నెల 22 లేదా 23వ తేదీల్లో పోలింగ్ జరుగబోతోందా? ప్రస్తుత పరిణామాలను చూస్తే ఈ ప్రశ్నలకు ‘అవుననే’ సమాధానం వినవస్తోంది. ఇప్పటి వరకూ వార్డుల రిజర్వేషన్లను వెల్లడించకపోయినప్పటికీ... ఎన్నికల నోటిఫికేషన్ నుంచి పోలింగ్ తేదీ మధ్య సమయాన్ని 15 రోజులకు కుదిస్తూ తాజాగా సోమవారం జీవో జారీ చేయడం దీనికి ఊతమిస్తోంది. సాధారణంగా నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకు కనిష్టంగా 21 రోజుల వ్యవధి ఉండాలి. అంతకన్నా తక్కువ ఉండేందుకు వీలులేదు. ఈ చట్టాన్ని సవరిస్తూ... వ్యవధిని 15 రోజులకు తగ్గించారు. ఈ నేపథ్యంలో అధికార వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఈ నెల 8 లేదా 9వ తేదీల్లో నోటిఫికేషన్ జారీ కానున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే 22 లేదా 23వ తేదీన పోలింగ్ జరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నోటిఫికేషన్ తేదీలో మార్పులు చోటు చేసుకుంటే అందుకనుగుణంగా పోలింగ్ తేదీలు నిర్ణయిస్తారు. నోటిఫికేషన్ కంటే ముందు వార్డుల రిజర్వేషన్లు వెలువడాల్సి ఉంది.
ఆ తరువాత ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం జారీ చేయాల్సి ఉంది. సాధారణ ఎన్నికలకైతే షెడ్యూలుకు, నోటిఫికేషన్‌కు మధ్య వ్యవధి ఉంటుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు మాత్రం షెడ్యూలు విడుదల చేసే రోజునే నోటిఫికేషన్‌ను వెలువరించవచ్చునని సంబంధిత అధికారులు చెబుతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే, నేడో, రేపో రిజర్వేషన్లను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. దాన్ని బట్టి నోటిఫికేషన్ ఉంటుంది. చట్ట సవరణకు ముందు ఉన్న వ్యవధిని... సవరణ ద్వారా చేసిన వ్యవధిని పోల్చి చూస్తే.. నామినేషన్లకు ఒక రోజు... ఉపసంహరణకు రెండు రోజులు... ఉప సంహరణ నుంచి పోలింగ్‌కు మధ్య వ్యవధిని 3 రోజులు కుదించారు. హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ మేరకు ఈ నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు చట్ట సవరణ చేసినట్లు తెలుస్తోంది.