► జూన్ 21కి తెలుగు రాష్ట్రాల్లో 6 స్థానాలు ఖాళీ
► జూన్ 17కల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తికి సన్నాహాలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా జూన్ 21న ఖాళీ అవుతున్న 21 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ఈ వారంలో ప్రకటించనుంది. జాబితాలో తెలంగాణ నుంచి 2, ఆంధ్రప్రదేశ్ నుంచి 4 స్థానాలు ఉన్నాయి. వీటన్నిటికీజూన్ రెండోవారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. రాజ్యసభలో ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న టీడీపీ సభ్యుడు వై.సుజనాచౌదరి, బీజేపీ సభ్యురాలు నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ సభ్యులు జైరాం రమేశ్, జేడీశీలం, తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ సభ్యుడు వి.హనుమంత రావు, టీడీపీ తరఫున ఎన్నికై ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో చేరిన గుండు సుధారాణి పదవీ కాలం జూన్ 21తో ముగుస్తోంది. అలాగే అదే రోజున దేశవ్యాప్తంగా మరో 15 స్థానాలు ఖాళీ అవుతున్నాయి.
నిబంధనల ప్రకారం వీటిని జూన్ 22కల్లా భర్తీ చేయాల్సి ఉన్నందున ఎన్నికల ప్రక్రియను జూన్ 17 కల్లా పూర్తి చేస్తారని తెలుస్తోంది. జూన్ 21 సభ్యత్వం ముగిసేవారి జాబితాలో రాజ్యసభకు కర్నాటక నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు, ఆస్కార్ ఫెర్నాండెజ్, విజయ్ మాల్యా, ఆయనూర్ మంజునాథ, తమిళనాడు నుంచి నవనీత కృష్ణన్, ఎస్.తంగవేలు, రబీ బెర్నాడ్, ఈఎం.సుదర్శన నాచియప్పన్, మనోజ్ పాండ్యన్, కేపీ.రామలింగం, మధ్యప్రదేశ్ నుంచి అనిల్ మాధవ్ దవే, చందన్ మిత్ర, విజయలక్ష్మి సాధో, ఛత్తీస్‌గఢ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మొహసిన కిద్వాయ్, నంద కుమార్‌లు ఉన్నారు.
రాజ్యసభ ఎన్నికలకు ఈ వారంలో నోటిఫికేషన్!
Published Mon, May 2 2016 6:03 AM | Last Updated on Mon, Sep 17 2018 6:12 PM
Advertisement
Advertisement