రేవణ్ణ, డీకేఎస్ మధ్య ఫైట్
రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సమయంలో వాగ్వాదం
బెంగళూరు: రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సమయంలో మంత్రి డి.కె.శివకుమార్, జేడీఎస్ ఏజంట్‌గా వ్యవహరించిన ఆ పార్టీ నేత హెచ్.డి.రేవణ్ణ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాలు.....రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో శనివారం జరిగిన పోలింగ్ కార్యక్రమంలో కలబుర్గి గ్రామీణ ఎమ్మెల్యే జి.రామకృష్ణ పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. ఆరోగ్యం సరిగ్గా లేనందువల్ల తన బదులుగా ఎమ్మెల్సీ కె.గోవిందరాజు ఓటు వేస్తారని జి.రామకృష్ణ ఎన్నికల అధికారులకు తెలియజేశారు అనారోగ్య వివరాలను తెలియజేసే మెడికల్ సర్టిఫికెట్‌ను సైతం అధికారులకు అందజేశారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ గోవిందరాజు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాగానే జేడీఎస్ ఏజంట్‌గా వ్యవహరిస్తున్న హెచ్.డి.రేవణ్ణ అడ్డుకున్నారు. ‘నువ్వు ఎమ్మెల్సీవి, నువ్వు ఇక్కడికి వచ్చేందుకు నీకు ఎవరు అనుమతిచ్చారు’ అంటూ అడ్డుకున్నారు. దీంతో బయటే ఉన్న మంత్రి డి.కె.శివకుమార్ అక్కడికి చేరుకున్నారు. ‘మా ఎమ్మెల్సీని అడ్డుకునేందుకు నువ్వెవరు, ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్లు’ అంటూ రేవణ్ణ పై మండిపడ్డారు. దీంతో వీరిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం నెలకొంది. అనంతరం ఇరు పార్టీల నేతలు, ఎన్నికల అధికారులు కలగజేసుకొని వారిద్దరికీ నచ్చజెప్పడంతో ఓటింగ్ మళ్లీ సాధారణంగా కొనసాగింది.