
సాక్షి, హైదరాబాద్: రైల్వేకు, సరుకు రవాణాదారుకు మధ్య పరస్పర సహకారం కొనసాగితే గతేడాది సాధించిన రికార్డుకంటే మెరుగైన ఫలితం సాధించే అవకాశం ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా ఆశాభావం వ్యక్తం చేసారు. దక్షిణ మధ్య రైల్వే 2018–19 ఆర్థిక సంవత్సరానికిగాను భారతీయ రైల్వే లోని అన్ని జోన్‌లకంటే ఉత్తమ స్థాయిలో సరుకు రవాణా చేసిన రికార్డును పురస్కరించుకొని సరుకు రవాణాలో క్రియాశీలక భాగస్వామ్యంగా ఉన్న పరిశ్రమల అధికారు లు, ప్రతినిధులు, ఇతర కంపెనీలను గురువారం సికింద్రాబాద్ రైల్‌నిలయంలో సన్మానించింది. జీఎం మాట్లాడుతూ జోన్‌లోని అధికారులు, సరుకు వినియోగదారు మధ్య విశ్వసనీయ సంబంధాలు, సమర్థవంతమైన కార్యాచరణ అమలు చేయడం, అందుబాటులోని గూడ్స్ వ్యాగన్ల వినియోగంతో సరుకు రవాణాలో అత్యధిక రికార్డు సాధించిందన్నారు.
వినియోగదారుల ప్రతిస్పందన విలువైందని, వాటిని రైల్వే పరిగణనలోనికి తీసుకుంటుందని అన్నారు. గణనీయ స్థాయిలో సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచే కొత్త మార్గాలైన, డబ్లింగ్/ట్రిప్లింగ్ మార్గాలు, విద్యుదీకరణ వంటి మౌళిక సదుపాయాల గురించి వివరించారు. జోన్ చేసిన సరుకు రవాణాలో ఎరువు, ఐరన్ వోర్, ఆహార ధాన్యాలే కాకుండా బొగ్గు (55%), సిమెంట్ (23%) తొలి 2 స్థానాల్లో నిలిచాయని అన్నారు. బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో సింగరేణి, విద్యుత్ ఉత్పత్తి కంపెనీల అవసరాలు తీరుస్తూ మొత్తం సరుకు రవాణాలో 39%, కేవలం బొగ్గు రవాణాలో 71% నమోదు చేసిందన్నారు. సమావేశంలో సీఎండీ ప్రభాకరరావు, ఏపీ జెన్‌కో చైర్మన్ అజయ్ జైన్, సింగరేణి కంపెనీ ఎలక్ట్రికల్ మెకానికల్ డెరైక్టర్ ఎస్.శంకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment