సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల ఫలితాలన్నీ వారం రోజుల్లో తేలిపోనున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుసగా జరిగిన మూడు ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు ముహూర్తం దగ్గర పడింది. ఈనెల 12న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల మున్సిపాలిటీలతోపాటు పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట, వేములవాడ నగర పంచాయతీలకు మార్చి 30న ఎన్నికలు జరిగాయి. వీటన్నింటా కార్పొరేటర్లతో పాటు వార్డు సభ్యులుగా గెలిచే విజేతలెవరో సోమవారం మధ్యాహ్నంకల్లా తేలిపోనుంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ఈవీఎంలను ఉపయోగించటంతో ఓట్ల లెక్కిం పు వేగంగా పూర్తి కానుంది. కౌంటింగ్ ప్రారంభించాక రెండు గంటల వ్యవధిలోనే మొత్తం ఫలితాలు వెల్లడవుతాయి.
కరీంనగర్, రామగుండం, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, పెద్దపల్లికి సంబంధించిన ఓట్ల లెక్కింపును అదే పట్టణాల్లో నిర్వహించనున్నారు. సిరిసిల్ల, వేములవాడ, హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్‌కు సంబంధించిన ఓట్లను కరీంనగర్ మండలం చింతకుంటలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ హాస్టల్‌లో లెక్కించేందుకు ఏర్పా ట్లు చేశారు. షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 2న వెల్లడించాల్సిన ఈ ఫలితాలు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు స్టే ఇవ్వటంతో వాయిదాపడ్డ విషయం విదితమే. 40 రోజుల నిరీక్షణ తర్వాత ఫలితాలు వెలువడనుండటం ఉత్కంఠ రేపుతోంది.
మరుసటి రోజైన 13న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. జిల్లాలో రెండు విడతలుగా మొత్తం 57 జెడ్పీటీసీ స్థానాలు, 804 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సంబంధిత రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోనే ఈ ఓట్లను లెక్కిస్తారు. అందుకు అనువుగా జిల్లా యంత్రాం గం కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. బ్యాలెట్ పద్ధతిన జరిగిన ఎన్నికలు కావటంతో ఈ ఓట్ల లెక్కింపు ఆలస్యమవనుంది. మధ్యాహ్నం నుంచి ఫలితాల వెల్లడి మొదలవుతుంది. కొన్ని మండలాల్లో ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశముంది.
ఈనెల 16న ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాలకు, రెండు ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో అన్ని సెగ్మెంట్లలో హోరాహోరీగా అభ్యర్థులు పోటీ పడటంతో పాటు ప్రధాన పార్టీలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తుండటంతో ఈ ఫలితాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
వారం రోజులుగా ఎక్కడ ఎవరి నోటా ఉన్న విజేతలెవరు.. ఎవరు గెలిచే అవకాశముందనే చర్చలే జోరుగా సాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కరీంనగర్‌లో మూడు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈవీఎంల ద్వారా ఓటింగ్ జరగటంతో మధ్యాహ్నం 3 గంటలకల్లా అన్ని నియోజకవర్గాల ఫలితాలు వెల్లడవుతాయి.
ఫలితాల మేళా
Published Sat, May 10 2014 2:18 AM | Last Updated on Wed, Sep 5 2018 3:24 PM
Advertisement
Advertisement