
Section 49P in The Conduct of Elections Rules, 1961: ఎన్నికల్లో మన ఓటు అపరిచితులు వేస్తే... మన ఓటు హక్కును మనం తిరిగి సాధించుకునేందుకు ఎన్నికల చట్టం అవకాశం కల్పిస్తోంది. అదే సెక్షన్ 49పీ.
సాక్షి, కరీంనగర్: ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయడం సర్వసాధారణం. పోలింగ్ సమయంలో ఏజెంట్లు అప్రమత్తంగా లేని సమయంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన కార్యకర్తలు అవతలి వ్యక్తుల ఓటును వేసి వెళ్తుండటం చూస్తుంటాం. అపరిచితులు వేసిన మన ఓటును అంగీకరించి సరేలే అని తిరిగి రావలసిన పనిలేదు. మన ఓటు హక్కును మనం తిరిగి సాధించుకునేందుకు ఎన్నికల చట్టం అవకాశం కల్పిస్తోంది. అదే సెక్షన్ 49పీ.
చదవండి: అనగనగా.. ఓ ఈవీఎం.. దీని జీవితకాలమెంతో తెలుసా?
ఇలా చేయాలి
తన ఓటును మరొకరు వేసినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత పోలింగ్ కేంద్రంలోనే చాలెంజ్ ఓటును నమోదు చేసుకోవచ్చు. పోలింగ్ సమయంలో మన ఓటును ఎవరైనా అంతకుముందే వేసినట్లు సదరు ఓటరు గుర్తిస్తే వెంటనే సంబంధిత పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఆ ఓటును వెనక్కి తీసేయమని అధికారులను కోరే అవకాశాన్ని ఈ సెక్షన్ పౌరులకు కల్పిస్తుంది. కండాక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961లోని సెక్షన్ 49పీ ఇదే విషయాన్ని చెబుతుంది.
చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నిక: కండువా కప్పుకుంటే ఎంతిస్తావ్?
వెంటనే చాలెంజ్ కోసం రూ.5 అక్కడి ప్రిసైడింగ్ అధికారికి చెల్లించి ఓటును నమోదు చేయాల్సిందిగా కోరితే అతని వద్ద ఉన్న గుర్తింపుకార్డు తదితరాలన్నింటినీ పరిశీలించి అనుమతి ఇస్తారు. మొత్తం ఓట్లలో అదనపు ఓటుగా ప్రత్యేకంగా గుర్తిస్తూ ఈ ఓటును కలిపి లెక్కించకుండా దాచి ఉంచుతారు. ఓట్ల లెక్కింపు సమయంలో బ్యాలెట్‌పై మనం వేసిన ఓటును చివరికి లెక్కిస్తారు. గెలుపు ఓటముల్లో ఈ ఓటు అవసరాన్ని బట్టి దీనిని అప్పుడు పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడు సెక్షన్ 49పీ గురించి తెలిసింది కదూ..? మన ఓటును మనం వేసేందుకు సన్నద్ధమవుదామా మరి.