మెట్రో అలైన్‌మెంట్ మార్పుపై కేసీఆర్ ఆరా
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎలివేటెడ్ మెట్రో రైలు అలైన్‌మెంట్ (మార్గం) మార్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎల్ అండ్ టీ, హెచ్‌ఎంఆర్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. శనివారం రాత్రి సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఎల్ అండ్ టీ ఎండీ ఈడీ గాడ్గిల్, హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డిలతో సమావేశమయ్యారు.
ముఖ్యం గా సుల్తాన్ బజార్ చారిత్రక మార్కెట్, మొజాం జాహి మార్కెట్, గన్‌పార్కు, అసెంబ్లీ మీదుగా వెళ్లే మెట్రో మార్గాన్ని భూగర్భ మార్గం గుండా మార్చితే ఎలా ఉంటుందన్న అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి తక్షణం నివేదిక సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించా రు. కాగా, నగరంలో ఇప్పటికే ఈ మార్గంలో పలుచోట్ల ఎల్ అండ్ టీ సంస్థ పిల్లర్లు నిర్మించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
వారి వా దనతో సీఎం ఏకీభవించకుండా, తాను చెప్పిన అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలని స్పష్టం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నగర చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మెట్రో పనులు చేపట్టాలని సూచించారు. కాగా, సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాకు లీక్ చేయవద్దని సీఎం సంబంధిత అధికారులను గట్టిగా ఆదేశించినట్లు సమాచారం.