సాక్షి, హైదరాబాద్: నగరంలో అట్టహాసంగా ప్రారంభమైన మెట్రోపొలిస్ సదస్సుపై అన్ని వర్గాల్లో విస్తృత అవగాహన కల్పించడంలో నిర్వాహకులు విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు 50 దేశాల ప్రతినిధులు హాజరయిన ఈ అంతర్జాతీయ సదస్సుకు ఈనెల 6 నుంచి 9 వరకు మీడియా ప్రతినిధులను హైటెక్స్ భవనం వరకే పరిమితం చేయడం, సదస్సు జరుగుతున్న హెచ్‌ఐసీసీవేదిక దరిదాపుల్లోకి చేరనీయకపోవడంతో వారు పలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. గురువారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సదస్సుకు రావడంతో ఈ ఆంక్షలు తీవ్రమయ్యాయి.
నాలుగురోజుల పాటు జరిగిన సదస్సులను హైటెక్స్ భవనంలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ తెరలపై వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే పలు సదస్సులకు సంబంధించిన ప్రసారాలు స్పష్టంగా కనిపించక, వక్తల ప్రసంగాలు సరిగా వినిపించకపోవడంతో విదేశీప్రతినిధుల అభిప్రాయాలను, అనుభవాలను సైతం క్షుణ్ణంగా తెలుసుకోవడం కష్టసాధ్యమైందని పలువురు మీడియా ప్రతినిధులు ఆక్షేపించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరవాత తొలిసారిగా జరిగిన మెట్రోపొలిస్ సదస్సు గురించి నగరంలోని యువత, మహిళలు, మేధావులు, సాంకేతిక నిపుణులు, ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల ప్రతినిధులకు సరైన అవగాహన కల్పించడంలోనూ అధికారులు విఫలమయ్యారు. దీంతో పలువురు సదస్సులో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేయించుకోలేకపోయారు. విదేశాలకు చెందిన సుమారు 60 నగరాల మేయర్లు ఈ సదస్సులో పాల్గొంటారని తొలుత నిర్వాహకులు హడావుడిగా ప్రకటించినప్పటికీ అంతమంది మేయర్లు ఈ సదస్సులో పాల్గొనలేదని తెలిసింది. ఆయా నగరాలకు చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులే సదస్సులో పాల్గొన్నట్లు సమాచారం. ఇక కీలక అంశాలపై ప్రముఖులు తెలిపిన విలువైన సలహాలు, సూచనలను బహిర్గతం చేయడంలోనూ నిర్వాహకులు విఫలమయ్యారు. మొక్కుబడిగానే సదస్సుల వారీగా పత్రికాప్రకటనలు విడుదల చేసి అందులో అరకొర విషయాలను పేర్కొని మమ అనిపించడం గమనార్హం.