బతక లేక.. మెతుకు లేక..
- కష్టాల కడలిలో ‘చెన్నమ్మ’
- దెబ్బతిన్న కుమారుడి రెండు కిడ్నీలు
- ఓ కిడ్నీని దానం చేసిన తల్లి
- కాళ్లు విరిగిన భర్త
- దిక్కూమొక్కు లేక దీనావస్థలో పేద కుటుంబం
- మెరుగైన వైద్యం కోసం దాతల వైపు చూపు
సాక్షి, సిటీబ్యూరో: ఆ నిరుపేద కుటుంబాన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. సమస్యల మీద సమస్యలు రావడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. అటు బతుకుదెరువు సాగక, ఇటు వైద్యం చేయించుకునే పరిస్థితి లేక ఆ కుటుంబం సతమతమవుతోంది. కొడుకు రెండు కిడ్నీలు పాడైతే తల్లే ఓ కిడ్నీ దానం చేసింది. అదే సమయంలో భర్త గాయపడి మంచాన పడ్డాడు. ఇన్ని సమస్యల మధ్య ఆమె ఒక్కతే పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న భర్త, కుమారుడి వైద్యం కోసం దాతల వైపు దీనంగా ఎదురు చూస్తోంది చెన్నమ్మ.
మాలపాటి బాల చెన్నయ్య(38), చెన్నమ్మ(36)లు దంపతులు. వీరికి బాలు(14) అనే కుమారుడున్నాడు. వీరిది గుంటూరు జిల్లా నరసారావుపేట వెంగళరెడ్డి నగర్. నిరుపేద దళిత వర్గానికి చెందిన వీరు కూలి పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరి ఏకైక కుమారుడు బాలు స్థానికంగా ఏడోతరగతి చదువుతున్నాడు. గత ఏడాది బాలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. నగరంలోని ఉస్మానియాలో వైద్యులు పరీక్షించి అతడి రెండు కిడ్నీలు చెడిపోయాయని తేల్చారు.
బాలుకు ప్రాణం పోసేం దుకు తల్లి చెన్నమ్మ ముందుకు వచ్చింది. తన కిడ్నీని కుమారుడికి దానం చేసింది. నిమ్స్‌లో ఆపరేషన్‌కు ఆరోగ్యశ్రీ కింద వచ్చిన రూ.2 లక్షలతోపాటు ఇళ్లు అమ్మగా వచ్చిన రూ.9 లక్షలు కలిపి మొత్తం రూ.11 లక్షలు ఖర్చు చేశారు. నెలనెలా డయాలసిస్‌కు హైదరాబాద్‌కు రాలేక ఇక్కడే కూకట్‌పల్లి ప్రాంతంలోని ప్రగతినగర్‌లో భవన నిర్మాణ కూలీగా పనికి కుదిరా డు చెన్నయ్య. నాలుగు నెలల క్రితం చెన్నయ్య పనులు చేస్తూ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడ్డాడు. రెండు కాళ్లు విరిగిపోయి నడవలేని స్థితిలో ఉన్నాడు. అటు కుమారుడి పరిస్థితి బాగాలేక ఇటు భర్త మంచాన పడడంతో చెన్నమ్మ తల్లడిల్లిపోయింది.
ఆమె కిడ్నీ దానం చేసినందున నెలకు 30 రోజులు పని చేయలేని పరిస్థితి. అయినా ఎలాగోలా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. భర్త, కుమారుడి మందులకే నెలకు రూ.15 నుంచి 20 వేలు ఖర్చు అవుతోందని ఆమె చెబుతోంది. తనకు డబ్బులు చేతికివ్వాల్సిన అవసరం లేదని, కుమారుడుకి నెలనెలా డయాలసిస్, భర్త కోలుకునే వరకు మందులకు సహాయం చేస్తే చాలునని చెన్నమ్మ రెండు చేతులు జోడించి వేడుకొంటోంది. కరుణ చూపేవారెవరైనా 8106187906 నంబర్‌లో సంప్రదించాలని ఆమె కోరుతోంది.