మృతదేహం చేతిని ఎలుకలు కొరికిన దృశ్యం
ఎంజీఎం : వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమో రియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో మృతదేహాలకు భద్రత కరువైంది. మార్చురీ నిర్వహణపై అధి కారుల పట్టింపులేనితనం, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఫ్రీజర్లలో భద్రపరిచిన మృతదేహాలను ఎలుకలు కొరికేస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు జరిగినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఓ వికలాంగుడి మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతిన్న ఘటన సోమవారం వెలుగుచూసింది. ఆత్మహత్యకు పాల్పడిన ఒకరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎం మార్చురీలో భద్రపరచగా తెల్లవారేసరికి ఎలుకలు కొరుక్కుతిన్నాయి.
ఫ్రీజర్‌లోని మృతదేహాన్ని..
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని సుబే దారి వికలాంగుల వసతిగృహంలో రామ్మోహన్ అనే వికలాంగుడు ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం లేదనే మనస్తాపంతో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వసతి గృహం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. రామ్మోహన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ మృతదేహాన్ని తరలించేది లేదని యాక్షన్ కమిటీ నేతలు భీష్మించుకు కూర్చు న్నారు. ఈ క్రమంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆదివారం రాత్రి ఎంజీఎం మార్చురీకి తరలించారు. సోమవారం ఉదయం ఆస్పత్రికి వచ్చిన బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు.. ఫ్రీజర్‌లోని మృతదేహం చేతి భాగాన్ని ఎలుకలు కొరకడాన్ని గమనించి నివ్వెరపోయారు.
ఎనిమిది ఫ్రీజర్లకు రెండే
కొన్ని నెలల క్రితం ఎంజీఎం మార్చురీలో ఓ మృతదేహాన్ని ఎలుకలు కొరకడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మార్చురీ అభివృద్ధిపై దృష్టి సారిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయినా పరిస్థితి ఏమాత్రం మారలేదు. మార్చురీలో 8 ఫ్రీజర్లు పనిచేయాల్సి ఉండగా.. ప్రస్తుతం రెండే అందుబాటులో ఉన్నాయి. దీంతో మార్చురీకి రెండు కన్నా ఎక్కువ మృతదేహాలొస్తే వాటికి రక్షణ లేకుండాపోతోంది. మృతదేహాన్ని ఎలుకలు కొరికిన ఘటనపై కుటుంబ సభ్యులు, బం«ధుమిత్రులు సిబ్బందిని ప్రశ్నించగా.. తరుచూ జరిగే ఘటనలేనని పేర్కొనడం గమనార్హం.
పాత భవనం.. సిబ్బంది కొరత..
ఎంజీఎం మార్చరీ ప్రాంగణమంతా చెత్తాచెదారంతో నిండిపోయి ఎలుకలకు స్థావరంగా మారింది. డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది. ఫోరెన్సిక్ వైద్యులు ఎనిమిది మంది ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం ఇద్దరే విధుల్లో ఉన్నారు. ఆరుగురు నాలుగో తరగతి సిబ్బందికిగాను ముగ్గురే ఉండడంతో తిప్పలు తప్పడం లేదు. మార్చురీ భవనం పాతబడటంతో ఇబ్బంది పడాల్సి వస్తోందని ఫోరెన్సిక్ వైద్యులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment