మధ్య సీట్లే అనుకూలం!
- వాటి బుకింగే బంగారం స్మగ్లింగ్‌కు అనువు
- నిఘా ముమ్మరం చేసిన కస్టమ్స్ అధికారులు
సాక్షి, హైదరాబాద్: దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖపట్నానికి బంగారం అక్రమ రవాణా చేస్తూ బుధవారం చిక్కిన అబ్దుల్ కేసు దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానంలో ఉండే ‘మధ్య సీట్లే’ స్మగ్లర్లకు అనుకూలమని అధికారుల విచారణలో వెల్లడైంది. ఎయిర్‌లైన్స్ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే సమయంలో కల్పిస్తున్న సౌకర్యం స్మగ్లర్లకు కలిసి వస్తోందని అధికారులు గుర్తించారు. బుధవారం చెన్నైకి చెందిన అబ్దుల్ 2.4 కేజీల బంగారంతో దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా (ఏఐ 952) విమానంలో హైదరాబాద్ వచ్చా డు.
బంగారం ఉన్న బ్యాగ్‌ను తన సీటు కిందే వదిలి అంతర్జాతీయ ప్రయాణికుడిగా విమా నం దిగి కస్టమ్స్ తనిఖీలు పూర్తి చేసుకుని బయటకు వచ్చాడు. నేరుగా డిపాచర్ లాంజ్‌కు వెళ్లి అదే విమానంలో విశాఖపట్టణం వెళ్లిపోవడానికి ముందే బుక్ చేసుకున్న టికెట్ ఆధారంగా దేశవాళీ ప్రయాణికుడిగా ఎక్కి అంతకు ముందు కూర్చున్న సీటులోనే కూర్చున్నాడు. ఈలోపు శంషాబాద్ విమానాశ్రయ కస్టమ్స్ విభాగం ఆధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అప్రమతత్తతో చిక్కాడు. ఈ కేసును కస్టమ్స్ పలు కోణాల్లో దర్యాప్తు జరిపింది. అంతర్జాతీయ ప్రయాణికుడిగా వచ్చిన ఇతడికి విమానం దేశవాళీ సర్వీసుగా మారిన తరవాత మళ్లీ అదే సీటు ఎలా దొరికిందనే అంశంపై లోతుగా ఆరా తీసింది.
ఎయిర్ ఇండియా సంస్థ విమాన టికెట్లను ప్రయాణికుడు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేప్పుడు తమకు అనువైన సీటును ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. దీన్నే అబ్దుల్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. దుబాయ్ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విశాఖపట్టణాలకు ఇతడు నిర్ణీత సమయం ముందుగానే విడివిడిగా ఒకే విమానంలో టిక్కెట్లు బుక్ చేసుకుంటూ... 2 సర్వీసుల్లోనూ ఒకే సీటును ఎంచుకున్నాడు. మధ్యలో ఉండే సీట్లనే ఎంచుకుని ఇబ్బంది లేకుండా పథకాన్ని అమలు చేయాలని భావించి చిక్కాడు. ఇదే విధంగా మరికొందరు స్మగ్లర్స్ ఈ తరహాలో బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్న కస్టమ్స్ అధికారులు ‘ఎస్కార్ట్స్ ఆఫీసర్స్’ సంఖ్యను పెంచి నిఘా ముమ్మరం చేశారు.