మేడ్చల్ నుంచి కంటైనర్‌లో బయల్దేరిన వలస కూలీల అభివాదం
వలస జీవుల ప్రయాణం కొనసాగుతోంది. ఉన్నచోట ఉపాధి లేక...సొంత ఊరికి వెళ్లేందుకు సిద్ధమై వేలాది మంది బయలుదేరారు. కొందరు కాలినడకన..మరికొందరు శ్రామిక్ రైళ్లలో ఊరిబాట పట్టారు. నగరంలో భవన నిర్మాణ రంగంలో వలస కూలీలదే కీలక పాత్ర. ఈ నేపథ్యంలో వలసకూలీలను ఆపాలని ప్రభుత్వం ఎంతగాప్రయత్నించినా ఫలితం కల్పించడం లేదు. ఒక్క భవన నిర్మాణ రంగంలోనే మొత్తం వలసకార్మికులు దాదాపు 2.32 లక్షల మందికిపైగా ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 948 ప్రాంతాల్లో భవన నిర్మాణాల సైట్‌ల వద్ద సుమారు 95,859 కార్మికులు ఉన్నట్లు రెవెన్యూ, కార్మిక,జీహెచ్‌ఎంసీ వర్గాలు లెక్క తేల్చాయి. అందులో 41,740 మంది కార్మికులకు సుమారు 284కేంద్రాల్లో ఆశ్రయం కల్పించారు. కానీ ఫలితంకన్పించడం లేదు. క్యాంపులో ఉన్న వలస కూలీలు సైతం సొంత ఊరికి వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే దాదాపు సగం మంది వెళ్లిపోగా...మిగతా వారు సైతం పాస్‌ల కోసం పోలీస్ స్టేషన్ల వద్ద క్యూ కడుతున్నారు. దీనివల్ల నగరంలో భవన నిర్మాణరంగం పనులు నిలిచిపోయే ప్రమాదం
ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మేడ్చల్ జాతీయ రహదారిపై కుమారుడితో వలస కూలీ
‘దూరం..దూరం’ దూరమైంది. మాస్క్..గీస్కు మర్చిపోయారు. కడుపు మాడుతున్నా లెక్కచేయడం లేదు. మూటా ముళ్లే సర్దుకుంటున్నారు. పిల్లా పాపలతో గంటల కొద్దీ రోడ్లపై వేచి చూస్తున్నారు. ఎండ మండుతున్నా భయపడడం లేదు. ఊరికి పోవడమొక్కటే లక్ష్యం. అది కాలినడక అయినా...కదిలే రైలు అయినా...కిక్కిరిసిన ట్రక్కు అయినా ఫర్వాలేదు...సొంతూరికి పోవాల్సిందే. నగరంలో వలస జీవుల పరిస్థితి రోజురోజుకు దుర్భరంగా మారుతోంది. సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు వారు నానా పాట్లు పడుతున్నారు. ఒకే లారీలో లేదా ట్రక్కులో ఎంత మందినైనా ఎక్కిస్తున్నారు. మనిషికి రెండు వేలుఅడుగుతున్నా..సరే అంటున్నారు. మాస్కులు లేకుండా..దూరం పాటించకుండా ఒకరిపై ఒకరు కూర్చుంటూ...ఇలా కిక్కిరిసి ప్రయాణిస్తున్న దృశ్యాలుగురువారం ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడయ్యాయి.
సాక్షి, సిటీబ్యూరో: కరువు రక్కసితో ఉపాధి దొరక్క నగరానికి పొట్టచేతపట్టుకొని వచ్చిన వలసజీవి ఆకలితో సొంతూరికి పయనమయ్యాడు. గ్రేటర్‌లో జీవనోపాధి పొందుతున్న వలస కార్మికుడిపై కరోనా వేటు పడింది. లాక్‌డౌన్ ప్రభావంతో పనులు లేక ఆకలితో ఉండలేక వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు సొంతూరికి వెళుతున్నారు. ఇప్పటికే దాదాపు 1.17 లక్షల మందిగ్రేటర్‌ను వీడి వెళ్లారు. సిటీలో తినడానికి తిండి లేక పూట గడవడం కష్టమై పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. లాక్‌డౌన్ ఎప్పుడెత్తేసారో అర్థంకాక మూట ముల్లె సర్దుకొని కాలి నడికన కొందరు, లారీల్లో మరికొందరు, సైకిళ్లపై ఇంకొందరు ఊరుబాట పడ్డారు. ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన రైళ్లలో సైతం ప్రయాణమవుతున్నారు. తాజగా సరిహద్దు రాష్ట్రమైన ఏపీ కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తోంది. ఇంకా వేలమంది సరిహద్దుల్లో, షెల్టర్లలో గడుపుతూ తమను స్వస్థలాలకు పంపాలని ఆందోళన చేస్తున్నారు. సగానికి పైగా వలస కార్మికులువివిధ మార్గాల్లో స్వస్థలాలకు చేరేందుకు హైదరాబాద్ మహానగరాన్ని దాటేశారు. మరికొందరు తమను వెనక్కు పంపాలని పోలీసులకు ఆర్జీలు పెట్టుకుంటున్నారు.
కూలీల క్యాంప్‌లు ఖాళీ
లాక్‌డౌన్ ప్రభావంతో భవన నిర్మాణ రంగం కూలీలు క్యాంపులు ఖాళీ అయ్యాయి. లాక్‌డౌన్‌లో గ్రీన్ సిగ్నల్ లభించినా పనులు మాత్రం పెద్దగా ప్రారంభం కాలేదు. లాక్‌డౌన్ నేపథ్యంలో సుమారు 1230పైగా ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. ప్రభుత్వమే అధికారికంగా 948 ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులు ఆగిపోయినట్లు గుర్తించింది. ప్రభుత్వ లెక్కల్లోకి రాని మరో మూడు వందలకు పైగా ప్రాంతాల్లో నిర్మాణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
చేయూత అంతంతే..
మహానగర శివార్లలోని భవన నిర్మాణ రంగం పనులపై ఆధారపడిన వలస కార్మికుల సంఖ్య రెండున్నర లక్షలపైనే ఉంటుందన్నది అంచనా. హైదరాబాద్ మహా నగరానికి ఉపాధి కోసం వలస వచ్చి లాక్‌డౌన్‌లో చిక్కుకున్న కార్మికులు అకలితో అలమటించకుండా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినా సగం మందికి కూడా సహాయం అందనట్లు తెలుస్తోంది. మొత్తం 2.32 లక్షల మందికిపైగా వలస కార్మికులు ఉన్నట్లు గుర్తించారు. అందులో 948 ప్రాంతాల్లో భవన నిర్మాణాల ప్రాంతాల వద్ద సుమారు 95,859 మంది ఉన్నట్లు రెవెన్యూ, కార్మిక, జీహెచ్‌ఎంసీ వర్గాలు లెక్క తెల్చాయి. అందులో 41,740 మంది కార్మికులకు సుమారు 284 కేంద్రాల్లో ఆశ్రయం కల్పించి ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించారు. అవి కూడా మూనాళ్ల ముచ్చటగానే తయారైంది. పౌరసరఫరాల శాఖ బియ్యం కేటాయించగా రెవెన్యూ శాఖ అధ్వర్యంలో 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం, రూ. 500 చొప్పున నగదు పంపిణీ చేశారు. క్షేత్ర స్థాయిలో బియ్యం, నగదు పంపిణీకి సవాలక్ష కొర్రీలు తప్పలేదు. అత్యధిక శాతం వర్కింగ్ సైట్లలో ఉన్న కూలీలకు తిండి కరువైంది. వారికి ఇటూ ప్రభుత్వం, అటూ బిల్డర్స్ పట్టించుకోకపోవడంతో ఇంటి బాట పట్టారు.
పోలీస్టేషన్ల ముందు క్యూ..
లాక్‌డౌన్‌తో స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు వలస కార్మికులు పోలీస్ స్టేషన్ల ముందు క్యూ కడుతూనే ఉన్నారు. ఇప్పటికే మహానగర పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో సుమారు 3.12 లక్షల మంది కూలీలు స్వస్థలాకు వెళ్ళేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అందులో రైలు, ఇతర మార్గాల ద్వారా సుమారు 1.17 లక్షల మంది ప్రయాణమయ్యారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వక ముందే సుమారు లక్షకు పైగా కార్మికులు కాలినడకన ప్రయాణం కట్టగా, సడలింపు అనంతరం రైళ్ల ఏర్పాటు ఆలస్యంతో మరో 50 వేల మంది వరకు ప్రైవేటు, సొంత వాహనల్లో ప్రయాణమైనట్లు తెలుస్తోంది.
మరో రెండు రైళ్లలో 3,143 మంది తరలింపు
శేరిలింగంపల్లి:లింగంపల్లి రైల్వేస్టేషన్ నుంచి బుధవారం రాత్రి రెండు రైళ్లలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 3,143 మంది వలస కార్మికులను స్వస్థలాలకు తరలించారు. మొదటి రైలు లింగంపల్లి నుంచి గోరక్‌పూర్‌కు రాత్రి 10.25 గంటలకు 1,539 మందిని తరలించారు. అనంతరం అర్ధరాత్రి ఒంటి గంటకు లింగంపల్లి నుంచి బలరామ్‌పూర్‌కు 1,604 మందిని తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment