పాసుల కోసం పడిగాపులు | Migrant Workers Line to Police Stations For Passes in Hyderabad | Sakshi
Sakshi News home page

పాసుల కోసం పడిగాపులు

Published Wed, May 6 2020 10:04 AM | Last Updated on Wed, May 6 2020 10:04 AM

Migrant Workers Line to Police Stations For Passes in Hyderabad - Sakshi

ఫిలింనగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ హాల్‌లో వలస కూలీలను కూర్చోబెట్టిన పోలీసులు

గచ్చిబౌలి: స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ పాస్‌ల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు పోలీస్‌ స్టేషన్లకు పోటెత్తుతున్నారు. నగరంలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో వందల సంఖ్యలో వలస కూలీలు తరలి రావడంతో పోలీసులు వారిని ఫంక్షన్‌ హాళ్లలో కూర్చోబెట్టి పాస్‌లు జారీ చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా నగరంలో చిక్కుకు పోయిన బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్‌ఘడ్, ఒడిషా, వెస్ట్‌బెంగాల్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు  మంగళవారం ఉదయం 8 గంటలకే పీఎస్‌లకు చేరుకున్నారు. గచ్చిబౌలి పోలీసులు సంధ్య కన్వెన్షన్‌లో, మాదాపూర్‌ పోలీసులు హైటెక్స్‌లో, రాయదుర్గం పోలీసులు జేఆర్‌సీ కన్వెన్షన్‌లో, మియాపూర్‌ పోలీసులు విశ్వనాథ్‌ గార్డెన్, చందానగర్‌ పోలీసులు బీకే రాఘవరెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో పాస్‌లు జారీ చేశారు. ఒక్క హైటెక్స్‌కు దాదాపు నాలుగు వేల మంది తరలిరాగా మియాపూర్‌ విశ్వనాథ్‌ గార్డెన్‌లో 2 వేల మందికి పైగా వచ్చారు. గచ్చిబౌలి, రాయదుర్గం పీఎస్‌ల వద్ద రెండువేల మంది బారు లు తీరారు. మాదాపూర్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో ఒక్కరోజే 5వేల మంది వరకు పేర్లు నమోదు చేసుకున్నట్లు ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు వివరించారు.

మీర్‌చౌక్‌ డివిజన్‌లో..
యాకుత్‌పురా: వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు పంపించేందుకు మీర్‌చౌక్‌ డివిజన్‌ పోలీసులు చర్యలు చేపట్టారు.  పేర్లు నమోదు చేసుకున్నారు. మీర్‌చౌక్‌ ఏసీపీ ఆనంద్‌ కథనం మేరకు... ఇప్పటి వరకు  డివిజన్‌లోని డబీర్‌పురాలో 440, మొఘల్‌పురాలో 450, మీర్‌చౌక్‌లో 450, రెయిన్‌బజార్‌ 460 మంది వలస కార్మికులను గుర్తించామన్నారు. ఇందులో 56 మందిని సోమవారం రాత్రి ప్రత్యేక రైలులో పంపినట్లు తెలిపారు. 

ఎండలోనే నిరీక్షణ..
రహమత్‌నగర్‌: ఇతర రాష్టాల వలస కూలీలు పాస్‌లు తీసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.  ధృవీకరణ పత్రాలతో మంగళవారం స్థానిక పోలీస్‌ అవుట్‌ పోస్టుకు వందలాంది మంది చేరుకోవడంతో పోలీసులు   ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానిక ఫంక్ష హాల్‌లో దరఖ>స్తులు తీసుకుంటామని చెప్పడంతో వారు ఎండను సైతం లెక్క చేయకండా జాతీయ రహదారిపై పడిగాపులు కాశారు. 

పాఠశాలలో కౌంటర్‌ ...
గోల్కొండ: స్వస్థలాలకు తిరిగి వెళ్లదలచుకున్న వలస కూలీలు పేర్లు నమోదు చేసుకునేందుకు గోల్కొండ ప్రభుత్వ ఉర్దూ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. టోలీచౌకీ, గోల్కొండ, షేక్‌పేట్‌ తదితర ప్రాంతాలకు 2 వేల మంది తరలివచ్చారు. 

కుత్బుల్లాపూర్‌ పరిధిలో..
కుత్బుల్లాపూర్‌: పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేష  పరిధిలో భవన నిర్మాణ పనులు చేస్తున్న వలస కూలీలు పోలీస్‌స్టేషన్‌ ఎదుట పాస్‌లు తీసుకునేందుకు క్యూ కట్టారు.

మా ఊరికి పంపించండి సారూ..
విజయనగర్‌కాలనీ: ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న వలస కూలీలు తమను స్వస్థలాలకు పంపించాలని కోరారు. సోమవారం రాత్రి 110 మందిని  బిహార్‌కు పంపించినట్లు ఇన్‌స్పెక్టర్‌ నాగం రవీందర్‌  తెలిపారు. అలాగే మాసబ్‌ట్యాంక్‌ చాచా నెహ్రూ పార్కు వద్ద వలస కూలీల వివరాలు నమోదు చేసుకుంటున్నట్లు హుమాయూన్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సునీల్‌కుమార్‌ తెలిపారు.

ఐడీ నంబర్‌ ఆధారంగా..
ముషీరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ముషీరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు అనుమతి కోసం మంగళవారం ముషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు క్యూ కట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాప్‌లో అనుమతి కోసం వచ్చిన వలస కార్మికుల వివరాలను సేకరించి వారికి ఐడీ నంబర్‌ కేటాయిస్తున్నారు. త్వరలో వారి ఫోన్‌లకు రైలు ఎప్పుడు, ఎన్ని గంటలకు బయలుదేరే విషయంపై సమాచారం వస్తుందని, అప్పటి వరకు వేచిచూడాలని ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు. మంగళవారం సుమారు 2 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement