
మినిస్టర్ చందూలాల్
25 ఏళ్ల తర్వాత మంత్రి పదవి
కలిసొచ్చిన సామాజికవర్గం
టీఆర్‌ఎస్‌లో కొత్త సమీకరణలు
నామినేటెడ్ పోస్టులపై అందరి దృష్టి
వరంగల్ : ములుగు ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్ గిరిజన సంక్షేమశాఖ మంత్రి అయ్యారు. పర్యాటక, సాంస్కృతిక శాఖలు ఆయనకే దక్కాయి. మంగళవారం ఉదయం రాష్ట్ర మంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. చందూలాల్‌కు మంత్రి పదవి రావడం ఇది రెండోసారి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1989లో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పని చేశారు. 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే శాఖ దక్కింది. మంత్రుల సంఖ్యపై పరిమితి నేపథ్యంలో మరో రెండు శాఖలను కేసీఆర్ చందూలాల్‌కే కేటారుుంచారు. వివాదరహితుడిగా పేరుంది. టీఆర్‌ఎస్ తరఫున గెలిచిన గిరిజన సామాజికవర్గం ఎమ్మెల్యేలలో ఆయనే సీనియర్. కీలకమైన శాఖలకు మంత్రిగా నియమితుడైన చందూలాల్‌పై జిల్లా ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారు. తెలంగాణలో గిరిజన జనాభా అధికంగా ఉన్న జిల్లా కావడంతో ఈ వర్గం వారు భారీగా ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో ప్రాచీన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. పర్యాటక, సాంస్కృతిక శాఖలు చందూలాల్‌కే దక్కడంతో జిల్లాకు ప్రాచీన వైభవం వస్తుందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు.
వరంగల్‌కు ప్రాధాన్యం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలి ప్రభుత్వంలో వరంగల్ జిల్లాకు రాజకీయంగా మంచి ప్రాధాన్యత దక్కింది. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్యకు రాష్ట్రంలో కీలకమైన ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది. భూపాలపల్లి ఎమ్మెల్యే ఎస్.మధుసూదనాచారిని స్పీకర్ పదవి వరించింది. జిల్లాకు చెందిన ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులకు నామినేటెడ్ పదవులు వచ్చాయి. బి.రామచంద్రుడుకు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పదవి, బి.వి.పాపారావుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవులు దక్కాయి. తాజాగా చందూలాల్‌కు మంత్రి పదవి దక్కింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు సహాయ మంత్రి హోదా కలిగిన పార్లమెంటరీ కార్యదర్శి పదవి వచ్చింది. వినయ్‌కు ఏ శాఖ బాధ్యతలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.
రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవుల్లోనూ జిల్లాకు ప్రాధాన్యత దక్కుతుందని టీఆర్‌ఎస్ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి. ఈ నెలాఖరులోనే జిల్లాలోని మరో ఇద్దరు, ముగ్గురు నేతలకు నామినేటెడ్ పదవులు దక్కనున్నట్లు గులాబీ వర్గాలు చెబుతున్నాయి.