మంత్రి జగదీశ్‌రెడ్డికి తప్పిన ప్రమాదం
కాన్వాయ్‌కి అడ్డొచ్చిన ఇన్నోవాను తప్పించబోయి ప్రమాదం
కట్టంగూర్: మంత్రి జి.జగదీశ్‌రెడ్డికి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. మంత్రి కాన్వాయ్‌కి అడ్డొచ్చిన వాహనాన్ని తప్పించే క్రమంలో రెండు వాహనాలు ఢీకొనడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మంత్రి సూర్యాపేట జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. కట్టంగూర్ మండలం ఎర్రసానిగూడెం స్టేజీ వద్దకు ఆయన కాన్వాయ్ రాగానే అదే సమయంలో గ్రామంలో నుంచి ఓ ఇన్నోవా కారు అకస్మాత్తుగా రోడ్డుపైకి దూసుకొచ్చింది.
దానిని తప్పించేందుకు కాన్వాయ్‌లో ముందున్న వాహన డ్రైవర్ పూర్తిగా కుడివైపునకు తిప్పాడు. దీంతో ఆ వాహనం హైదరాబాద్ వైపు వెళ్లే రోడ్డు వైపునకు దూసుకెళ్లింది. ఇదే క్రమంలో విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు మంత్రి కాన్వాయ్ వాహనాన్ని ఢీకొట్టింది. వాహనంలో ఉన్న మంత్రి అటెండర్ లింగయ్య, భద్రతాధికారి అవినాశ్‌రెడ్డి, మంత్రి బంధువు కరుణాకర్‌రెడ్డి, ఇన్నోవా డ్రైవర్ కృష్ణతో పాటు గరిడేపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆరెపూరి సత్యానికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వీరిలో లింగయ్య, సత్యం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాదుకు తరలించారు.