
చిన్నారి పరిస్థితిపై ఇప్పుడే ఏం చెప్పలేం!
చేవెళ్ల: బోరుబావిలో పడిన చిన్నారి ఆచూకీ కనుక్కొనేందుకు త్రిడైమన్షన్ మ్యాట్రిక్స్ కెమెరాను బోరుబావిలోకి పంపామని, అయితే, 180 అడుగుల వద్ద నీళ్లు తగలడంతో చిన్నారి ఆచూకీ లభించలేదని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. దీంతో ప్రత్యేక మోటారు ద్వారా నీటిని అంతటిని తోడిస్తున్నామని ఆయన చెప్పారు. చిన్నారి పరిస్థితిపై ఇప్పుడే ఏం చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. ఇక జిల్లా వైద్యాధికారి బాలాజీ మాట్లాడుతూ చిన్నారిని బయటకు తీసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. నిరంతరం బోరుబావిలోకి ఆక్సీజన్ పంపుతున్నామని, చిన్నారిని బయటకు తీయగానే వైద్యం అందించేందుకు చేవెళ్ల ప్రభుత్వాస్పత్రి.. హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో ఏర్పాట్లు చేశామని బాలాజీ చెప్పారు.
'సాక్షి' ఉద్యమంలో నేనూ పాల్గొంటా: కొండా విశ్వేశ్వరరెడ్డి
తెరిచి ఉన్న బోరుబావులను వెంటనే మూసివేయాలంటూ 'సాక్షి' పిలుపునిచ్చిన ఉద్యమంలో తాను కూడా పాల్గొంటానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలో 30వేలకుపైగా తెరిచి ఉన్న బోరుబావులున్నట్టు అంచనా ఉందని, వీటిని వెంటనే మూసివేసేందుకు ఉచితంగా క్యాప్‌లు పంపిణీ చేస్తామని తెలిపారు. చేవెళ్ల మండలంలోని చనువెళ్లి గ్రామ పరిధి ఇక్కారెడ్డిగూడెంలో గురువారం సాయంత్రం 18నెలల చిన్నారి మీనా బోరుబావిలో పడిన సంగతి తెలిసిందే. చిన్నారిని బోరుబావిలోంచి వెలికితీసేందుకు జరుగుతున్న ఆపరేషన్‌ను మంత్రి మహేందర్‌రెడ్డి, అధికారులతో కలిసి దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.