
విషాదం: చిన్నారి మీనా మృతి
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లిలో బోరుబావిలో పడిన చిన్నారి మీనా మృతి చెందినట్లు మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. దీంతో దాదాపు 60 గంటలపాటు ఎంతో శ్రమించినా ఫలితం శూన్యమైంది. ఎయిర్ ప్రెషర్ ద్వారా చిన్నారి మృతదేహాన్ని బయటకు తీయాలని సిబ్బంది యత్నిస్తుండగా బోరు బావి నుంచి చిన్నారి అవశేషాలతో పాటు దుస్తులు(ఫ్రాక్) బయటకు వచ్చినట్లు తెలిపారు. బోరు బావి నుంచి దుర్వాసన వస్తోందని, అయితే మృతదేహాన్ని తల్లిందండ్రులకు అప్పగించి వారికి పాప చివరిచూపును కల్పించేందుకు విశ్వ ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు చెప్పారు. మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటనతో చిన్నారి మీనా తల్లిదండ్రులతో పాటు బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.
దీంతో బోరు బావి సమీప ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. గురువారం మీనా అనే ఏడాదిన్నర పాప బోరుబావిలో పడిపోయిన విషయం తెలిసిందే. అయితే మూడు రోజులుగా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో చిన్నారిని ప్రాణాలతో కాపాడలేకపోయారు. గురువారం 40 అడుగుల లోతున ఇరుక్కుపోయిన చిన్నారి.. శుక్రవారం బోరుబావిలోని మోటారు తీసినప్పటి నుంచి జాడ కనబడకుండా పోయింది. శనివారం ప్రత్యేక లేజర్ కెమెరాలతో పరిశీలించినా, అత్యాధునిక మ్యాట్రిక్స్ వాటర్‌ప్రూఫ్ కెమెరాను తెప్పించి.. 210 అడుగుల లోతు వరకు అన్వేషించినా చిన్నారి ఆచూకీ కానరాలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఎయిర్ ప్రెషర్ ద్వారా యత్నించగా.. చిన్నారి ఫ్రాక్ బయటకు రావడంతో పాటు బోరు బావి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో చిన్నారి మీనా మృతి చెందినట్లు నిర్దారించారు.
చిన్నారి మృతి బాధాకరం: మహేందర్ రెడ్డి
60 గంటలపాటు శ్రమించినా చిన్నారిని కాపాడలేకపోయాం. మీనా మృతి నిజంగా బాధాకరం. ఎంత శ్రమించినా మా శ్రమ ఫలించలేదు. ఎయిర్ ప్రెషర్ ద్వారా చిన్నారి దుస్తులు, అవశేషాలు రావడంతో మృతిచెందినట్లు గుర్తించాం. శవ పరీక్ష కోసం చిన్నారి మృతదేహాన్ని చేవెళ్ల ఆస్పత్రికి తరలించాం. పనిచేయని బోరుబావులు మూసివేయకుండా ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటాం. చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం.
సంబంధిత కథనాలు