బాబూ.. నీ ముఖం ఓసారి అద్దంలో చూసుకో!
విలేకరుల సమావేశంలో మంత్రి తలసాని ఘాటు వ్యాఖ్యలు
నీవు కట్టింది హైటెక్ సిటీని.. హైదరాబాద్‌ను కాదు
సంపద ఏపీలో సృష్టించుకో.. పట్టిసీమలో అయ్యా, కొడుకు ఎంత కొట్టేశారో తెలుసు
హైదరాబాద్: ‘‘సంపదను సృష్టించాను. దాన్ని కేసీఆర్ బాగా చూసుకోవాలి’’ అని మహానాడులో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని ఘాటుగా స్పందించారు. హైటెక్‌సిటీని కట్టి హైదరాబాద్ అభివృద్ధి అంతా తన ఘనతే అని చెబుతున్న చంద్రబాబు తన ముఖాన్ని ఓసారి అద్దంలో చూసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. మహానగర చరిత్ర 400 ఏళ్ల పైమాటే అని, అది తెలుసుకుని మాట్లాడాలన్నారు. దిక్కూ మొక్కు లేని ఆంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టించుకుంటే బాగుంటుందని తలసాని చంద్రబాబుకు సూచించారు. అయ్యా.. కొడుకు పట్టిసీమలో ఎంత కొట్టేశారో తనకు తెలుసని, ఒక్క రోజు యోగా కోసం రూ. కోటి 25 లక్షలు ప్రభుత్వ నిధులను విడుదల చేస్తే ఎవరూ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ‘‘ట్విట్టర్ పిట్టీ మహానాడులో మాట్లాడుతుంటే కరెంటు పోయిందంట... ఇదీ ఇక్కడి పరిస్థితి అని అంటున్నాడు... ఇంట్లో ఎలా పడుకుంటున్నాడో’’అంటూ లోకేశ్‌ను ఉద్దేశించి అన్నారు. రెండు గదుల బెడ్‌రూంలు ఐడీహెచ్ కాలనీలో తయారవుతున్నాయని వెల్లడించారు.
అంతకు ముందు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై సచివాలయంలో విలేకరులతో తలసాని మాట్లాడుతూ జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని 50 ప్రాంతాల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జేఏసీతో పాటు, ఓయూ విద్యార్థులను, అన్ని రాజకీయ పార్టీ నాయకులను కలుపుకొని ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు.