మిషన్ భగీరథ పథకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి నీటి కొరత అడ్డంకిగా మారుతోంది. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఈ ఏడాది జూన్, జూలై నుంచి ‘భగీరథ’ద్వారా తాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నా ప్రధాన రిజర్వాయర్లలో నీరు లేకపోవడం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. నాగార్జున సాగర్, శ్రీశైలంలలో నీటి మట్టాలు పడిపోవడం, కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టుల్లోని రిజర్వాయర్లలో అనుకున్న స్థాయిలో నీరు లేకపోవడంతో ఆందోళన చెందుతోంది.
మరీ ముఖ్యంగా నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీరు అందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఎల్లూర్ రిజర్వాయర్‌లో అత్యంత కనిష్టానికి నీరు చేరడం, ఈ రిజర్వాయర్‌కు నీరు అందకుండా శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ నీరు తోడేస్తుండటం భగీరథ కష్టాలను మరింత పెంచుతోంది.
అంచనాలు తలకిందులు..
నీటిపారుదల ప్రాజెక్టుల నుంచి తాగునీటికి 10 శాతం నీరు తీసుకోవాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. దీనికిగానూ కృష్ణా, గోదావరి బేసిన్‌ల పరిధిలోని 37 ప్రాజెక్టుల నుంచి ఈ జూన్ నుంచి ఏడాది వరకు 59.17 టీఎంసీలు అవసరమని అధికారులు అంచనా వేశారు.
ఇందులో కృష్ణా బేసిన్‌లోని జూరాల నుంచి 1.22 టీఎంసీలు, ఎల్లూర్ రిజర్వాయర్ నుంచి 7.12, కోయిల్‌సాగర్ నుంచి 1.3 టీఎంసీలతో పాటు సాగర్ ప్రాజెక్టు పరిధిలోని అక్కంపల్లి, ఉదయసముద్రం, పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా సుమారు 16 టీఎంసీలు తీసుకుని ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని గ్రామాలకు నీరివ్వాలని ప్రణాళిక వేశారు. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌లో నీటి కొరతతో నీటి సరఫరా గగనంగా మారింది. ముఖ్యంగా శ్రీశైలం జలాలపై ఆధారపడిన ఎల్లూర్ రిజర్వాయర్ కింద 7.12 టీఎంసీల అవసరం ఉండగా లభ్యత 0.3 టీఎంసీలే ఉంది.
‘పాలమూరు’కు ఇక్కట్లే..
శ్రీశైలంలో నీటిమట్టం ఇప్పటికే 800 అడుగులకు చేరగా, పవర్‌హౌజ్‌ల ద్వారా ఏపీ మరింత నీటిని వాడుకోవడంతో 799.90 అడుగులకు చేరింది. మరింత నీరు వాడుకుంటే మోటార్లు అమర్చినా నీరు తీసుకోవడం సాధ్యపడేలా లేదు. బీమా ప్రాజెక్టు పరిధిలోని శంకరసముద్రం రిజర్వాయర్‌లోనూ అనుకున్న స్థాయిలో మట్టాలు లేనందున పాలమూరు జిల్లాలో జూన్ నుంచి భగీరథకు నీళ్లందించలేని పరిస్థితి నెలకొంది. వైరా రిజర్వాయర్ కింద కనీస నీటిమట్టం 94.65 మీటర్లుగా నిర్ణయిస్తే ఇప్పటికే 94.29 మీటర్లకు పడిపోయింది. పాలేరు రిజర్వాయర్ పరిధిలో కనీస నీటిమట్టం 133.29 మీటర్లు కాగా 132.94 మీటర్లుకు చేరడంతో భగీరథకు నీరెలా అందిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
సమీక్షించనున్న ప్రభుత్వం
భగీరథ ద్వారా జూన్ నుంచి నీటిని సరఫరా చేయాలని భావిస్తున్న ప్రభుత్వం, రిజర్వాయర్లలో నీటి కొరతతో ఆందోళన చెందుతోంది. నీటి విషయమై పూర్తిస్థాయిలో సమీక్షించి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని భావిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ప్రస్తుతం రిజర్వాయర్లలోని మట్టాలు, జూన్ నుంచి ఆగస్టు వరకు నీటి లభ్యత, ఆవిరి నష్టాలపై నివేదిక కోరింది.
Comments
Please login to add a commentAdd a comment