Drinking water grid
-
‘భగీరథ’కు నీటి కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి నీటి కొరత అడ్డంకిగా మారుతోంది. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఈ ఏడాది జూన్, జూలై నుంచి ‘భగీరథ’ద్వారా తాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నా ప్రధాన రిజర్వాయర్లలో నీరు లేకపోవడం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. నాగార్జున సాగర్, శ్రీశైలంలలో నీటి మట్టాలు పడిపోవడం, కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టుల్లోని రిజర్వాయర్లలో అనుకున్న స్థాయిలో నీరు లేకపోవడంతో ఆందోళన చెందుతోంది. మరీ ముఖ్యంగా నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీరు అందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఎల్లూర్ రిజర్వాయర్‌లో అత్యంత కనిష్టానికి నీరు చేరడం, ఈ రిజర్వాయర్‌కు నీరు అందకుండా శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ నీరు తోడేస్తుండటం భగీరథ కష్టాలను మరింత పెంచుతోంది. అంచనాలు తలకిందులు.. నీటిపారుదల ప్రాజెక్టుల నుంచి తాగునీటికి 10 శాతం నీరు తీసుకోవాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. దీనికిగానూ కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని 37 ప్రాజెక్టుల నుంచి ఈ జూన్ నుంచి ఏడాది వరకు 59.17 టీఎంసీలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇందులో కృష్ణా బేసిన్‌లోని జూరాల నుంచి 1.22 టీఎంసీలు, ఎల్లూర్ రిజర్వాయర్ నుంచి 7.12, కోయిల్‌సాగర్ నుంచి 1.3 టీఎంసీలతో పాటు సాగర్ ప్రాజెక్టు పరిధిలోని అక్కంపల్లి, ఉదయసముద్రం, పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా సుమారు 16 టీఎంసీలు తీసుకుని ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని గ్రామాలకు నీరివ్వాలని ప్రణాళిక వేశారు. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌లో నీటి కొరతతో నీటి సరఫరా గగనంగా మారింది. ముఖ్యంగా శ్రీశైలం జలాలపై ఆధారపడిన ఎల్లూర్ రిజర్వాయర్ కింద 7.12 టీఎంసీల అవసరం ఉండగా లభ్యత 0.3 టీఎంసీలే ఉంది. ‘పాలమూరు’కు ఇక్కట్లే.. శ్రీశైలంలో నీటిమట్టం ఇప్పటికే 800 అడుగులకు చేరగా, పవర్‌హౌజ్‌ల ద్వారా ఏపీ మరింత నీటిని వాడుకోవడంతో 799.90 అడుగులకు చేరింది. మరింత నీరు వాడుకుంటే మోటార్లు అమర్చినా నీరు తీసుకోవడం సాధ్యపడేలా లేదు. బీమా ప్రాజెక్టు పరిధిలోని శంకరసముద్రం రిజర్వాయర్‌లోనూ అనుకున్న స్థాయిలో మట్టాలు లేనందున పాలమూరు జిల్లాలో జూన్ నుంచి భగీరథకు నీళ్లందించలేని పరిస్థితి నెలకొంది. వైరా రిజర్వాయర్ కింద కనీస నీటిమట్టం 94.65 మీటర్లుగా నిర్ణయిస్తే ఇప్పటికే 94.29 మీటర్లకు పడిపోయింది. పాలేరు రిజర్వాయర్ పరిధిలో కనీస నీటిమట్టం 133.29 మీటర్లు కాగా 132.94 మీటర్లుకు చేరడంతో భగీరథకు నీరెలా అందిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. సమీక్షించనున్న ప్రభుత్వం భగీరథ ద్వారా జూన్ నుంచి నీటిని సరఫరా చేయాలని భావిస్తున్న ప్రభుత్వం, రిజర్వాయర్లలో నీటి కొరతతో ఆందోళన చెందుతోంది. నీటి విషయమై పూర్తిస్థాయిలో సమీక్షించి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని భావిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ప్రస్తుతం రిజర్వాయర్లలోని మట్టాలు, జూన్ నుంచి ఆగస్టు వరకు నీటి లభ్యత, ఆవిరి నష్టాలపై నివేదిక కోరింది. -
ప్రతిపల్లెకూ తాగునీరు
గద్వాల: కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య నడిగడ్డలో తాగునీటి కష్టాలకు ఇక చెక్ పడినట్లే..! చెంతనే రెండు జీవనదులు ఉన్నా గుక్కెడు నీళ్లు దొరకడం లేదన్న బాధ ఇక ఉండదు..! జిల్లాలో సాగు, తాగునీటికి ఢోకా ఉండదని సీఎం కేసీఆర్ ఇటీవల జిల్లాకు వచ్చిన సందర్భంగా ప్ర కటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గద్వాల డివిజన్లోని 319 గ్రామాలకు మూడున్నరేళ్లలో రూ.600 కోట్ల వ్యయం తో పనులను చేపట్టే విధంగా వాటర్‌గ్రిడ్ ప్ర తిపాదనలను ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం పథకానికి నిధులు సమకూరిస్తే మరో మూడేళ్లలో తాగునీటి సమస్య లేకుండా ప్రతి పల్లెకూ రక్షిత మంచినీటిని అందించవచ్చు. ఈ మేరకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు డిజైన్‌ను రూపొందించారు. ఇందులో భాగంగానే జూరాల భారీ తాగునీటి పథకం స్థానంలోనే గ్రిడ్ ప్రధాన నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని సంకల్పించారు. ఇప్పటివరకు ఈ పథకంలో పైపులైన్లలో పగుళ్లకు కారణమైన కాంట్రాక్టర్, పైబర్ పైపు ల ఏర్పాటుపై సంబంధిత అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఫైబర్‌పైపుల స్థానంలో డీఐ పైపులు వేసి ప్రతిపల్లెకు తాగునీటిని అందించాలని సంకల్పించారు. ఆ నాలుగు గ్రామాలకు లేనట్లే..! గద్వాల మండలంలోని కృష్ణానది మధ్యలో ఉన్న గుర్రంగడ్డ గ్రామం, అలంపూర్ నియోజకవర్గంలో తుంగభద్ర నది అవతలివైపున ఉన్న ర్యాలంపాడు, సుల్తానాపురం, జిల్లెలపాడు గ్రామాలకు మంచినీటి గ్రిడ్ ద్వారా నీటిని పంపింగ్చేసే అవకాశం లేదు. ఈ నాలుగు గ్రామాలకు ప్రత్యేకంగా తాగునీటి పథకాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తారు. నడిగడ్డ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు రక్షిత మంచినీటిని అందించేందుకు ఉన్నతాధికారులకు నివేదికలు పంపించామని ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మేఘారెడ్డి తెలిపారు. గ్రిడ్ రూపక ల్పన ఇలా.. జూరాల తాగునీటి పథకాన్ని తాగునీటి గ్రిడ్‌లో అనుసంధానం చేస్తారు. జూరాల రిజర్వాయర్ నుంచి జూరాల తాగునీటి పథకం ఫిల్టర్బెడ్స్వరకు నీటినిపంపింగ్ చేస్తా రు. అక్కడ శుద్ధిచేసిన నీటిని 4.5 కి.మీ దూరంలో ఉన్న కొండగట్టుపై నిర్మించిన రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేస్తారు. కొండగట్టు పైనుంచి నందిన్నె మీదుగా ఒకలైన్, బూరెడ్డిపల్లి మీదుగా మరో ప్రధానలైను, చింతరేవుల మీదుగా మూడో ప్రధానలైన్లలో డీఐ పైపులను 300 కి.మీ మేర వేస్తారు. గట్టు మండలంలో ఈ పథకం ద్వారా తాగునీరు అంద ని గ్రామాలకు ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి గజ్జెలమ్మగుట్టపై రిజర్వాయర్‌ను ఏర్పాటుచేసి అక్కడికి నీటిని పంపింగ్చేస్తారు. అక్కడి నుండి గ్రావిటీఫ్లో ద్వారా గట్టు మండలంలోని పడమటి గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించే విధంగా డిజైన్‌ను రూపకల్పన చేశారు. గద్వాల నియోజకవర్గంలో 171 గ్రామాలు, అలంపూర్ నియోజకవర్గంలో 148 గ్రామాలకు పూర్తిస్థాయిలో తాగునీటిని అందించేందుకు హెచ్డీ పైపులతో గ్రామాలకు మంచినీటి లింకులను ఏర్పాటుచేస్తారు. ఈ పైపులను రెండు నియోజకవర్గాల్లో 800కి.మీ పొడవునా నిర్మిస్తారు. ఇలా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు సమగ్ర నమూనాను రూపొందించారు.