ఏసీబీకి చిక్కిన భగీరథ బకాసురులు | Mission Bhagiratha Supervisor Booked By ACB | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన భగీరథ బకాసురులు

Published Wed, Aug 21 2019 8:33 AM | Last Updated on Wed, Aug 21 2019 8:34 AM

Mission Bhagiratha Supervisor Booked By ACB - Sakshi

తాండూరులో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ డీఈఈ శ్రీనివాస్, వర్క్‌ఇన్స్‌పెక్టర్‌ మహేందర్‌

సాక్షి, తాండూరు: మిషన్‌ భగీరథ బకాసురులు అడ్డంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికారు. వివరాలిలా ఉన్నాయి.. తాండూరు నియోజకవర్గంలో సుమారు. రూ.500 కోట్లతో మిషన్‌ భగీరథ పనులు సాగుతున్నాయి. మిషన్‌ భగీరథ పనుల పర్యవేక్షణ బాధ్యతలను ఆర్‌డబ్లుఎస్‌ శాఖకు అప్పగించారు. బషీరాబాద్‌ మండలం జీవన్గి, మైల్వార్, కంసన్‌పల్లితో పాటు పలు గ్రామాల్లో కడప జిల్లాకు చెందిన గురువయ్య కాంట్రాక్టర్‌గా పనులు చేస్తున్నాడు. రూ.1.50 కోట్లకు సంబంధించి కాంట్రాక్ట్‌ తీసుకున్నాడు. రూ.70 లక్షల పనులకు సంబంధించి మిషన్‌ భగీరథ పనులను పూర్తి చేయడంతో గురువయ్య రెండు నెలల క్రితం తాండూరులోని డీఈఈ కార్యాలయంలో బిల్లుల కోసం వచ్చారు.

డీఈఈ గతంలోనే రూ.65 వేలు డిమాండ్‌ చేయడంతో బిల్లుల కోసం నగదును లంచంగా ఇచ్చారు. దీంతో రూ.70 లక్షల్లో కొంత బిల్లులు చెల్లించారు. అయితే మరో రూ.20 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉండటంతో గత నెలలో గురువయ్య డీఈఈ శ్రీనివాస్‌ వద్దకు వెళ్లాడు. రూ.30 వేలను చెల్లిస్తేనే బిల్లులు చేస్తామని డీఈఈ చెప్పాడు. చేసేది లేక గురువయ్య గతనెల 25వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అదును కోసం ఎదురు చూసిన ఏసీబీ అధికారులు 20 రోజుల పాటు పక్కా ప్రణాళికతో పట్టుకోవాలని వేచి చూశారు.

ఏసీబీ ట్రాప్‌కు చిక్కిన డీఈఈ శ్రీనివాస్‌... 
మిషన్‌ భగీ«రథ పనుల కోసం బిల్లులు చేయాలని అందుకు కావాల్సిన పర్సంటేజ్‌ సిద్ధం చేసుకున్నానని కాంట్రాక్టర్‌ గురువయ్య అధికారులకు నమ్మబలికాడు. దీంతో గురువయ్య ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో రూ.30 వేలు తీసుకుని డీఈఈకి ఇచ్చేందుకు వచ్చారు. అయితే డబ్బులను వర్క్‌ఇన్స్‌పెక్టర్‌ మహేందర్‌కు ఇవ్వాలని చెప్పి పంపించారు. కార్యాలయ ఆవరణలో డబ్బులు తీసుకుంటుండగా మహేందర్‌ను.. రెడ్‌ హ్యాండెడ్‌గా డీఈఈ శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

అవినీతి అధికారులను వదలం.. 
అవినీతికి పాల్పడే అధికారులు ఎవరైన సరే ఆటకట్టిస్తామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. మిషన్‌ భగీరథ పనుల్లో కాంట్రాక్టర్‌ గాజుల గురువయ్య నుంచి లంచం డిమాండ్‌ చేస్తున్నారని బాదితుడు సమాచారం అందించారు. ఈ మేరకు ఈనెల 25వ తేది నుంచి నిఘా పెట్టడం జరిగిందన్నారు. మిషన్‌  భగీరథ పనులను పూర్తి చేసిన గురువయ్యకు బిల్లుల కోసం వెళితే లంచం డిమాండ్‌ చేశారని దీంతో గురువయ్య ఇప్పటి వరకు రూ.95 వేలు ఆర్‌డబ్లుఎస్‌ డీఈఈ శ్రీనివాస్‌కు లంచంగా ఇచ్చారని విచారణలో తేలిందన్నారు. లంచం తీసుకుంటు పట్టుబడిన డీఈఈ శ్రీనివాస్‌ను, వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌ మహేందర్‌ను అరెస్టు చేసి చంచల్‌గుడ జైలుకు తరలిస్తామన్నారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు నాగేంద్రబాబు, రాంలింగారెడ్డి, గంగాధర్, మజిద్‌లతో పాటు ఏసీబీ సిబ్బంది తదితరులున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement