జనవరి 10 నాటికి పనులు మొదలవ్వాలి: మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమం కింద చెరువుల పునరుద్ధరణ పనులను త్వరితగతిన ప్రాంభించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. జనవరి 10 నాటికి అన్ని జిల్లాల్లో ఎంపిక చేసిన చెరువుల్లో 50 శాతం చెరువుల సర్వే, అంచనాల తయారీ, పరిపాలనా అనుమతి, టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించాలని నిర్దేశించారు. మంగళవారం జలసౌధలో ‘మిషన్ కాకతీయ’ పనుల పురోగతి, ఇతర అంశాలపై నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్లు, జిల్లాల నోడల్ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఏఈఈ, డీఈఈలు చెరువులను సందర్శించకుండానే అంచనాలను యథాతథంగా ఎస్‌ఈలకు పంపుతున్నారని ఈ సందర్భంగా నోడల్ అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఆయకట్టు లేని చెరువుల తూములకు, కాల్వలకు మరమ్మతులను చేయొద్దని సూచించారు.
మిషన్ కాకతీయకు ఆర్థిక సహాయం కోరేందుకు వీలుగా కేంద్రానికి, జపాన్ బ్యాంకు, ప్రపంచ బ్యాం కులకు సమర్పించే నివేదికలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. దేవాదుల, ప్రాణహిత, రాజీవ్ భీమా, కొమరం భీం తదితర ప్రాజెక్టుల అటవీ అనుమతుల కోసం జీడీపీఎస్ సర్వేలు పూర్తి చేసి నివేదికలు పంపాలని కూడా ఆదేశించారు. ఈ సందర్భంగా అమెరికాకు చెందిన మిషిగాన్ యూనివర్సిటీ విద్యార్థులు మం త్రిని కలిసి మిషన్ కాకతీయపై తమ అధ్యయన వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరిలో యూనివర్సిటీ నిర్వహించనున్న గ్లోబల్ వాటర్ సింపోజియానికి ప్రత్యేక అతిథిగా అమెరికాకు రావాలని వారు ఆహ్వానించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, ఈఎన్‌సీలు మురళీధర్, విజయ్‌ప్రకాష్, చిన్న నీటి పారుదల శాఖ సీఈలు రామకృష్ణారావు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
‘మిషన్ కాకతీయ’ వేగం పెంచండి
Published Wed, Dec 31 2014 3:48 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM
Advertisement