సాక్షి, జనగామ: జనగామ మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫొటో ఓటరు జాబితాలో అనేక తప్పులు చోటు చేసుకుంటున్నాయి. కులాల గుర్తింపులో పొరపాట్లు చేసిన అధికారులు.. తండ్రి, భర్తల పేర్లు మార్చేసి మరో అడుగు ముందుకు వేశారు. ఓటరు జాబితాల్లో చోటుచేసుకున్న తప్పిదాలు.. సోషల్ మీడియా వేదికగా హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నెల 16న తుది ఓటరు జాబితా ప్రకటించగా.. ఒక్కొక్కటిగా తప్పులు వెలుగు చూస్తున్నాయి. 10వ వార్డుకు చెందిన రేఖ పేరు పక్కన తండ్రికి బదులుగా భర్త అని ముద్రించి.. తెలంగాణగా నమోదు చేశారు. ఆమె తల్లి మీరాబాయి.. భర్త పేరుకు బదులుగా తెలంగాణ, ఆమె భర్త సోనాబీర్ తండ్రికి బదులుగా తెలంగాణ అని ముద్రించారు. ఇంటిల్లిపాదికి ‘తెలంగాణ’పదాన్ని ఇచ్చేశారు.
వార్డుల వారీగా ఓటరు సర్వేతో పాటు ఫొటో ఐడెంటిఫికేషన్ సమయంలో.. క్షేత్రస్థాయిలో పనిచేయక పోవడంతోనే తప్పిదాలకు ఆస్కారం కలిగిందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే కులాల మార్పిడి దుమారం రేపుతోంది. ఓసీలను బీసీగా.. బీసీలను ఎస్సీలుగా అక్కడక్కడా మార్చడంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. 3వ వార్డుకు చెందిన ఓసీ కులానికి చెందిన దొంతుల భిక్షపతి కుటుంబాన్ని బీసీగా, బీసీ కులానికి చెందిన వారిని ఓసీగా మార్చడంతో గురువారం పురపాలక సంఘ కార్యాలయానికి వెళ్లి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓసీ నుంచి బీసీకి మార్చడంతో.. తమకు అదే సర్టిఫికెట్ ఇవ్వాలని భిక్షపతి కుటుంబ సభ్యులు అధికారులను డిమాండ్ చేశారు. ఏ ప్రాతిపదికన కులం పేరు మార్చారు.. వాటి వివరాలను చూపించాలని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment